Sep 26,2023 00:18

అరుకులోయలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం,

ప్రజాశక్తి - అరకులోయ, అనంతగిరి విలేకరులు
జిల్లాలోని ఏజెన్సీ ముఖద్వారంగా పేర్కొనే అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ వెంకయ్యపాలెం వద్ద యాత్ర బృందానికి గిరిజన మహిళలు ఎదురేగి సంప్రదాయబద్ధంగా తిలకందిద్ది, పూల దండలు వేసి తమ వాడల్లోకి ఆహ్వానించారు. అక్కడి నుంచి బైకు యాత్ర కాశీపట్నం, శివలింగపురం, డముకు, బొర్రా జంక్షన్‌ మీదుగా అనంతగిరి మండల కేంద్రానికి చేరింది. జూనియర్‌ కళాశాల ఆవరణలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, డి.రమాదేవి, అనంతగిరి జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ విషయంలో వైసిసి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. మోడీ సర్కారుకు వత్తాసు పలికే ధోరణినే ప్రదర్శిస్తోందని తెలిపారు. టిడిపి, జనసేన పార్టీలు మౌనం వీడి పోరాటంలోకి రావాలన్నారు. త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కును ఐక్యపోరాటాలతో కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, టోకూరు సర్పంచ్‌ కిల్లో మొస్య, తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి బీసుపురం మీదుగా అరకులో యలోకి యాత్ర ప్రవే శించింది.
అరకులోయ మండలంలోని సుంకరమెట్టలో గిరిజనులు, సిపిఎం మహిళా నాయకులు సాదర స్వాగతం పలికారు. పాదయాత్ర రథసారథి కె.లోకనాథం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర సహా యాత్ర బృందం సభ్యులకు పూలదండలు వేసి తిలకం దిద్ది హారతులిచ్చారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..? : లోకనాథం
అనంతరం అరకులోయలోని దండకారణ్య ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకనాథం మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలా మోసం చేసిందో వివరించారు. అదానీ, అంబానీల ప్రయోజనాలే మోడీ సర్కారుకు ముఖ్యమా ? అని ప్రశ్నించారు. గిరిజనులకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించే జిఒ నెంబర్‌ 3ని రద్దు చేయడం దారుణమన్నారు. గిరిజన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. గిరిజన చట్టాలకు మోడీ సర్కారు ఎలా తూట్లు పొడుస్తోందో వివరించారు. పచ్చని పంట పొలాల్లో గ్రీన్‌ ఎమర్జెన్సీ పేరుతో సోలార్‌ సిస్టం తెస్తున్నారని, దానివల్ల ఏజెన్సీ వాసులకు ఎటువంటి లాభమూ ఉండదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 120 గ్రామాలకు నేటికీ విద్యుత్‌ సౌకర్యం లేదన్నారు. మెరుగైన జీవితం రావాలంటే ప్రభుత్వ రంగ సమస్యలను పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌లోనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు.
పోరాటంలో మహిళలు అగ్రభాగాన ఉండాలి : రమాదేవి
పోరాటంలో మహిళలు ముందుండి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి అన్నారు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోడీ సర్కారు చేస్తున్న కుట్రలను వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్‌ గొంతును బిజెపి ప్రభుత్వం ఎలా నొక్కేసిందో వివరించారు. రైల్వేను ప్రైవేటుకు అప్పగించడం వల్ల ఇటీవల ఒడిశా దగ్గర ఎలాంటి ఘోర ప్రమాదం సంభవించిందో తెలియజేశారు. ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారని ఆమె ప్రశ్నించారు. అక్టోబర్‌ 5న స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వద్ద జరిగే ఉక్కు రక్షణ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఐదు వేల మంది గిరిజన, దళిత ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్లాంట్‌ ప్రైవేటుపరమైతే రిజర్వేషన్లు అమలుకావని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థల వల్లే విశాఖ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ సభలో బైకుయాత్రకు నేతృత్వం వహిస్తున్న బి.జగన్‌ మాట్లాడుతూ యాత్రకు ఎక్కడికక్కడ అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. యాత్ర ఆద్యంతం ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. అరకులోయలోని అంబేద్కర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర, అనంతగిరి జెడ్‌పిటిసి డి.గంగరాజు, సిపిఎం నాయకులు భాస్కరరావు, సత్యనారాయణ, కృష్ణారావు, సోమన్న, మన్మధరావు, రామ్మోహన్‌రావు, వి.ఉమామహేశ్వరరావు, సుంకరమెట్ట సర్పంచ్‌ చినబాబు, తదితరులు పాల్గొన్నారు.