Jun 15,2023 22:24

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ

పుట్టపర్తి రూరల్‌ : వికలాంగులు మూడు చక్రాల స్కూటర్లను సద్వినియోగం చేసుకోవాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన వికలాంగులకు మూడు చక్రాల స్కూటర్లను గురువారం అందజేశారు. ఈకార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, వికలాంగులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, ఆర్‌డిఒ భాగ్యరేఖ, ఎంపిపి రమణారెడ్డి, పుడా చైర్మన్‌ లక్ష్మీనరసమ్మ, సహాయ సంచాలకులు రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క సెక్షన్‌ నిరాదరణకు గురికారాదన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అర్హత ఉన్నా మూడు చక్రాల స్కూటర్లు రాని వారికి అందరికి కూడా స్కూటర్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వికలాంగులకు 2016లో వచ్చిన హక్కుల చట్టానికి ఎక్కడా విఘాతం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా రూ.1.26 లక్షలు విలువ చేసే 56 మూడు చక్రాల స్కూటర్లను ఎంపీ, తదితరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వయోవృద్ధుల సహాయ సంస్థ సూపరింటెండెంట్‌ రమణ, ఎంపీడీవో అశోక్‌ కుమార్‌ రెడ్డి, వికలాంగులుతదితరులు పాల్గొన్నారు.