ప్రజాశక్తి - ఆదోని
పట్టణ ప్రజలకు తాగునీరందించే బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు కుంగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే కారణమని టిడిపి నాయకులు విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వెంటనే నిర్మాణ పనులు చేయాలని కోరారు. మంగళవారం బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకును సందర్శించి కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ సూరం భాస్కర్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, పెద్ద మసీదు కమిటీ ఛైర్మన్ సౌదీ రావుఫ్, మాజీ కౌన్సిలర్ రామచంద్ర, మాజీ వైస్ ఛైర్మన్ ఫక్రుద్దీన్ మాట్లాడారు. మూడేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. పట్టణంలోని 2.5 కోట్ల జనాభా ఎస్‌ఎస్ ట్యాంకుపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. నీటిని నిల్వ చేసుకునే పరిస్థితిలో ఎస్‌ఎస్ ట్యాంకు లేదని తెలిపారు. గత 15 ఏళ్లు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోనే మున్సిపల్ కౌన్సిల్ పాలన చేసిందని, ఎందుకు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన రాంజల చెరువు ఇప్పటికీ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ఎస్‌ఎస్ ట్యాంకు 20 ఏళ్లకే నాణ్యత లేకుండా పోయిందని తెలిపారు. నిర్మాణ సమయంలోనే పనులు నాణ్యతగా జరగలేదని అప్పట్లోనే నిర్మాణంపై అనేక అపోహలు, ఆరోపణలు వచ్చాయని చెప్పారు. 2005 ఎన్నికైన కౌన్సిల్ దీనిపై ప్రత్యేక కమిటీ 2008లో వేసిందని తెలిపారు. కమిటీ ఇచ్చిన నివేదిక బయటకు రాలేదని, అప్పట్లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడంతో ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపంపై ఎలాంటి చర్చ లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా ఫైళ్లను మూసివేశారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యపై జిల్లా అధికారులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. టిడిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, నారాయణపురం షేక్షావలీ, కారుమంచి, మద్దికెర రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, మైనార్టీ నాయకులు సాధిక్ వలీ ఉన్నారు.
ఎస్‌ఎస్ ట్యాంకును సందర్శిస్తున్న నాయకులు










