ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
శాంతియుత నిరసనపై ప్రభుత్వ దమనకాండ విడనాడాలని ఎపి ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శివలక్ష్మి, నాయకులు రంగ లక్ష్మి, నరసమ్మ తెలిపారు. శనివారం ఆశావర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రభుత్వ ఒత్తిళ్లతో మృతి చెందిన కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, గుంటూరు జిల్లా కార్యదర్శి లక్ష్మి, ఆశాలు, సిఐటియు జిల్లా నాయకులను అరెస్టు చేసి తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారని తెలిపారు. నాయకులను, ఆశాలను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలను రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాలని కోరారు. మృతి చెందిన ఆశాల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, జగనన్న సురక్ష పేరుతో ఆశా వర్కర్లపై మోపిన పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. నరసమ్మ, అన్వేశ్వరి, విశాలాక్షి, లక్ష్మి, రహీంబీ పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడుతున్న ఆశాలు










