ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు లీజుకు ఇచ్చిన సందర్భాల్లో లీజు డాక్యుమెంట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ శాఖ వద్ద రిజిస్టర్ చేయించాలని కలక్టర్ రంజిత్ బాషా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన స్పందనలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత సింగ్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, చేపల, రొయ్యల చెరువులు, టోల్ గేట్స్ లీజ్ డీడ్స్ తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని, ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 24వ తేదీ శుక్రవారం గ్రామదర్శిని నిర్వహిస్తున్నట్లు, అధికారులు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. జిల్లాలో వివిధ శాఖల్లో స్పందన అర్జీల పరిష్కారం కలెక్టర్ సమీక్షించారు. రీఓపెన్ కేసులు 23 వరకు వచ్చాయని, వెంటనే పరిష్క రించాలన్నారు. జగనన్నకు చెబుదాం అర్జీల పెండింగ్ వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ జూన్ 14 వరకు ఉచితంగా నమోదు చేసుకో వచ్చని అన్నారు. ఈ నెల 21వ తేదీ జిల్లాలో పాఠశాలల్లో రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, అందుకు అనుగుణంగా జిల్లాలోని పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేయాలనిడీఈఓ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్జేసీ డిప్యూటీ కలెక్టర్ బి. శివనారాయణ రెడ్డి, బందరు ఆర్డీఓ ఐ.కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ డి డి కె.సరస్వతి, ఐసీడీఎస్ పీడీ ఎస్. సువర్ణ, జిల్లా రిజిస్టార్ ఉపేంద్రరావు, సీపీఓ వై. శ్రీలత, ముడా వీసీ రాజ్యలక్ష్మీ, డిఎంఅండ్ హెచ్ డా.గీతాబాయి, డ్వామా పీడీ జివి. సూర్యనారాయణ పాల్గొన్నారు.










