Oct 19,2023 19:52

మాట్లాడుతున్న గుడిసె కృష్ణమ్మ

ప్రజాశక్తి - ఆదోని
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా హరించడం దారుణమని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ విమర్శించారు. గురువారం ఆదోని 3వ పట్టణ పోలీసులు గుడిసె కృష్ణమ్మను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభలో నిరసన తెలియజేయడాన్ని అడ్డుకున్నారన్నారు. పోలీసులు వైసిపికి వత్తాసు పలకడంపై ఆమె ధ్వజమెత్తారు. టిడిపి బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వడ్డెమాన్‌ గోపాల్‌, మాజీ ఎంపిపి మురళీ, గిరిధర్‌ పాల్గొన్నారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులును బుధవారం రాత్రి వన్‌ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొని నిర్బంధించడం సమంజసం కాదంటూ నాయకులు తెలిపారు. హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన చేయడం ఏమిటని శ్రీనివాసులు ప్రశ్నించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా టిడిపి, వామపక్ష, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశామని డీఎస్పీ శివ నారాయణ స్వామి గురువారం తెలిపారు.