Aug 16,2023 21:52

జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసి, జగనన్న కాలనీలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం పట్టణ పరిధిలోని కృష్ణపల్లిలో ఉన్న జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఆర్థిక సహాయంతోపాటు సబ్సిడీ ధరలతో మెటీరియల్‌ అందిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇంటి నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. లేఅవుట్‌లో కరెంటు, నీటి సరఫరా, ఆర్చి నిర్మాణం, మురుగునీటి కాలువల పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. చేసిన పనులకు బిల్లులను వెంటనే సమర్పించాలని తెలిపారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టరు ఆర్‌. గోవిందరావు, అర్‌డిఒ కె.హేమలత, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఎం.వి.ఆర్‌.కృష్ణాజి, జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకర రావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనరు జె.రామ అప్పలనాయుడు, విద్యుత్తు, గృహనిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.