ఏళ్లుగడుస్తున్నా వినియోగంలోకి రాని
జీనబాడు బాలికల హాస్టల్ అదనపు భవనం
అవస్థలు పడుతున్న విద్యార్థినులు
కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు
ప్రజాశక్తి -అనంతగిరి : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అదనపు వసతి కల్పించాలనే లక్ష్యంతో కోట్లాది రుపాయలతో హాస్టల్ భవనం పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని దుస్థితి. ఒకవైపు విద్యారినులు అరకొర వసతితో అవస్థలు పడుతుంటే, మరోవైపు నిర్మాణం పూర్తయిన భవనం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రజాప్రతినిధుల చొరవ లేమికి నిలువెత్తు నిదర్శనంగా అనంతగిరి మండలంలోని జీనబాడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమఉన్నత పాఠశాల అదనపు హాస్టల్ భవనం నిలుస్తోంది. వివరాలివి.
మండలంలోని జీనబాడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమఉన్నత పాఠశాల విద్యార్థినులకు అదనపు వసతి కల్పనకు రూ.1.942కోట్ల ఆర్‌ఎంఎస్‌ఎ నిధులను 2019-20లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చకచకా నిర్మాణ పనులు చేపట్టి, అప్పట్లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే విద్యుదీకరణ పనులు చేపట్టకపోవడంతో అప్పట్లో ప్రారంభానికి నోచుకోలేదు. ఆతర్వాత పట్టించుకునే నాధులే లేకపోవడంతో దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇది ప్రారంభానికి నోచుకోక, వినియోగంలోకి రాని పరిస్థితి ఉంది.
ఒకవైపు విద్యార్థినులు చాలీచాలని వసతితో అవస్థలు పడుతుంటే, మరోవైపు నిర్మాణం పూర్తయిన పక్కా భవనాలను వినియోగంలోకి తేవడంతో అధికారుల నిర్లక్ష్యం, నేతల నిర్వాకంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు ఐదేళ్లుగా దాదాపు రెండు కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని పట్టించుకోకపోవడంతో చుట్టూ పిచ్చిమొక్కలు పేరుకుపోయి, శిథిల భవనంగా సాక్షాత్కరిస్తోంది. మరోవైపు భవనం గోడలు చెదలు పట్టి, బీటలు వారిపోతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, జీనబాడు బాలికల హాస్టల్ అదనపు భవనానికి విద్యుత్ సౌకర్యం కల్పించి వినియోగంలోకి తెచ్చే చర్యలు చేపట్టాలని, తద్వారా బాలికల వసతి కష్టాలకు మోక్షం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు.










