ప్రజాశక్తి - మక్కువ : మండలంలో విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్న లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం రైతులను మోసగించి డబ్బులు గుంజుకుంటున్న వైనం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. వీరి మోసాలకు గిరిజన, దళిత రైతులు బలవుతున్నారు. తాము మోసపోయామన్న విషయం ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితి వారిది. విద్యుత్ శాఖ సిబ్బంది మాయమాట్లోపడి కష్టపడిన సొమ్ముంతా వారి చేతుల్లో పెడుతున్నప్పటికీ వారి పొలాలకు మాత్రం విద్యుత్ లైన్లు అందడం లేదు. వివరాల్లోనికి వెళ్తే...
మండలంలోని సిబిల్లి పెద్దవలస గ్రామానికి చెందిన దళిత రైతు వెలగాడ రాము గత ఏడాది సెప్టెంబర్‌లో తన పొలానికి విద్యుత్ లైన్ మంజూరు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు చుట్టూ పలుమార్లు ప్రదక్షిణ చేశాడు. అయితే స్థానిక ఉద్యోగికి ఈ విషయమై తెలపగా, తనపై అధికారితో మాట్లాడి పనిచేస్తామని చెప్పాడు. ఇందుకోసం స్థానిక పెద్దల సమక్షంలో సుమారు రూ.60 వేలు కూడా చెల్లించాడు. పొలంలోనికి మూడు స్తంభాలను పెద్దవలస గ్రామం నుంచి తన సొంత ఖర్చులతో తీసుకువెళ్లానని తెలిపారు. ఏడాది కావస్తున్నప్పటికీ ఇంతవరకూ తనకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ శాఖ అధికారులను అడిగితే తన పేరున ఎలాంటి పిఆర్ లేదని అంటున్నారని వాపోయాడు. దీంతో తాను మోసపోయానని లబోదిబో మంటున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తన పొలానికి విద్యుత్తు లైను ఇప్పించాలని కోరుతున్నాడు.
అంతా మేమే చూసుకుంటాం.. నీకు ముగ్గేసి ఇచ్చేస్తాం..!
రైతులను ఇబ్బంది పెట్టకుండా, ఒక్క అడుగు బయటకు పెట్టకుండా అంతా తామే చేస్తున్నామని... నీకు కూడా అలాగే చేసి విద్యుత్ కనెక్షన్ వేసిన చోట ముగ్గేస్కోవచ్చని ఓ ఉద్యోగి నమ్మబలకడంతో నిరుపేద రైతు మోసపోవాల్సి వచ్చింది. ఒక విద్యుత్ కనెక్షన్ మంజూరు కావాలంటే జియాలజీ సర్టిఫికెట్‌తో పాటు ఫారం-3 ఇతర ధ్రువపత్రాలు నిబంధన ప్రకారం జమ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలించి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసే ఆస్కారం ఉంది. అయితే అవినీతికి అలవాటు పడ్డ కొంతమంది ఉద్యోగులు రైతులను మోసగిస్తూ ఇలాంటి చిల్లర పనులకు యత్నిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.










