ప్రజాశక్తి - పాలకొండ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన కోట దుర్గమ్మ దసరా నవరాత్రులు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారికి కలిశి పూజ నిర్వహించి, రాటవేసి, ఉదయం 8.30గంటల నుంచి అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, శాసనమండలి విప్ పాలవలస విక్రాంత్ పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. పాలకొండతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వచ్చిన వారికి అరకొర సౌకర్లే కల్పించారు. ఎండల్లో గంటల పాటు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. అమ్మవారి దర్శనం కోసం గంటల పాటు ఎదురు చూడాల్సి రావడంతో భక్తులు అసౌక ర్యానికి గురయ్యారు. సకాలంలో అమ్మవారి దర్శనం కల్పించడంలో పోలీస్ అధికారులు, దేవాదాయ అధికారాలు విఫలమ య్యారు. కొంతమంది క్యూలైన్లోనే సొమ్మసిల్లిన పరిస్థితి కనిపించింది. డిఎస్‌పి జివి కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి డివివి ప్రసాదరావు, ఆలయ ఎఒ మురళీకృష్ణ ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు
ఆధిపత్యం కోసం నేతల ఆరాటం...
కోట దుర్గమ్మ దసరా నవరాత్రుల ఉత్సవాల్లో అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం ఆరాట పడ్డారు. తమ అనుచరులకు అమ్మవారి దర్శనం కల్పించడం కోసం పాకులాడారు. దీంతో సామాన్య భక్తులకు కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.
విఐపిల తాకిడి..
కోట దుర్గమ్మ నిజరూప దర్శనం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వీరఘట్టం ఎంపిపి డి.వెంకటరమణ, టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, వైస్ ఎంపిపిలు సూర్యప్రకాష్, వకముడి అనిల్, వైస్ చైర్మన్లు రౌతు హనుమంతరావు, పల్లా ప్రతాప్, వైసిపి పట్టణ అధ్యక్షులు వెలమల మన్మధరావు, కోట దుర్గ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు దుప్పాడ పాపినాయుడు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
పోలమాంబ ఆలయంలో శరన్నవరాత్రులు
మక్కువ: మండలంలోని శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఆదివారం ప్రారంభించామని ఇఒ వి.రాధాకృష్ణ తెలిపారు. ముందుగా కలశ స్థాపన, విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనం, దీప స్థాపన, రుత్విక్ వరుణ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలతో ప్రారంభమైందని అన్నారు శరన్నవరాత్రి దసరా మహౌత్సవాలను కప్పగంతుల శ్రీనివాస శర్మ చే. హౌమములు కూడా జరిపించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పెద్దలు పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు
వీరఘట్టం : మండల కేంద్రంలోని ప్రముఖ పంచాంగ కర్త ఎస్వీఎల్‌ఎన్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభించిన దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులకు కనువిందు చేసేలా ఎంతో అట్టాసంగా ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుండి యాత్రికుల తాకిడి ఎక్కువ కావడంతో దుర్గమ్మ ఆలయమంతా కిటకిటలాడింది. శర్మయాజి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం మహల్చే పూజలు నిర్వహించి దుర్గమ్మ తల్లికి ప్రత్యేక ప్రార్థనలు గావించారు. అలాగే వచ్చిన యాత్రికులకు ఉచితంగా ప్రసాదం, మజ్జిగ, మంచినీటి సౌకర్యాలు యాజ ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు అలంకరణ చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నావు. ఎస్సై ఎంవి రమణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అవతారంలో నవదుర్గ
పార్వతీపురం టౌన్ : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మొదటిరోజు పట్టణంలో సారికివీధిలో ఉన్న భద్రకాళి ఆలయం, పాలకొండ రోడ్డులో ఉన్న దుర్గాదేవి ఆలయం, ఆడబడివీధిలో ఉన్న ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి దేవాలయం, ప్రధాన రహదారిలో ఉన్న కళింగ వైశ్య కన్యకాపరమేశ్వరి దేవాలయం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న భవానీ మాతా ఆలయం, కొత్తవలస శివారులో ఉన్న నవదుర్గ దేవి ఆలయాల్లో ఘనంగా దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. నవదుర్గ ఆలయంలో ఉన్న దుర్గాదేవిని మొదటి రోజు బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులు అలంకరించి దర్శించుకున్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండల కేంద్రమైన గుమ్మలక్ష్మీపురంలో ఆదివారం దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఊరేగింపుగా వెళ్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మోటార్ యూనియన్ వర్తక సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు , గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.










