జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. వరదనీరు పోటెత్తడంతో నదులు, వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహించాయి. తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టులు నిండుకుండల్లా నీటితో తొణికిసలాడుతున్నాయి. నదులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పార్వతీపురం పట్టణ శివారు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వీరఘట్టం మండలం నడుకూరులో, పార్వతీపురం మండలంలో జంఝావతి కాలువకు గండి పడటంతో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి.
జంఝావతి కాలువకు గండి
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామం మీదుగా గరుగుబిల్లి వెళ్తున్న జంఝావతి కాలువకు గురువారం ఉదయం గండి పడింది. ఆ కాలువ గట్టు తెగడంతో పార్వతీపురం- పాలకొండ రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. దీంతో గ్రామంలో రాకపోకలు స్తంభించాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉప్పొంగిన సాకిగెడ్డ
భారీవర్షాల కారణంగా మండలంలోని పుట్టూరు - లచ్చిరాజుపేట గ్రామాల మధ్య ఉన్న సాకిగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గురువారం సుమారు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఇదే సాగి గడ్డ పొంగి వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితితో లచ్చిరాజుపేట సెంటర్ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా పెద్దగెడ్డ
పాచిపెంట : మండలంలోని పెద్దగెడ్డ జలశయం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 213.8 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 212 మీటర్లు ఉంది. ప్రస్తుతం వర్షాల కారణంగా జలాశయంలోకి 170 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు 130 క్యూసెక్కుల నీరు విడిచి పెడుతున్నట్లు డిఇ పి.కనకారావు తెలిపారు.
గరుగుబిల్లి : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో తోటపల్లి రిజర్వాయరులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని ఎఇ శ్రీనివాసరావు తెలిపారు. రిజర్వాయరు సామర్థ్యం 2.534 టిఎంసిలు కాగా, గురువారం సాయంత్రానికి 2.278 టిఎంసిలకు చేరినట్లు చెప్పారు. రిజర్వాయరు పూర్తి నీటిమట్టం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 104.62 మీటర్లకు చేరినట్లు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 5845 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 4213 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. నాగావళి నది ద్వారా 2943 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 280 క్యూసెక్కులు, పాత కుడి ప్రధాన కాలువ ద్వారా 90, కొత్త కుడి ప్రధాన కాలువ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. దిగువ ప్రాంతం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్
పార్వతీపురం ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఏకధాటిగా 3 గంటలపాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలో ఉన్న వరహాలగెడ్డలో వరద నీరు పోటెత్తింది. పట్టణ ప్రధాన రహదారితో పాటు శివారులోని పలు కాలనీల్లో వీధులు జలమయం అయ్యాయి. గురువారం ఉదయం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముంపు ప్రాంతాలైన చైతన్య పాఠశాల పరిసరాలు, 20వ వార్డులో ఉన్న జనశక్తి కాలనీ, సుందర నారాయణ పురం కాలనీ, సౌందర్య థియేటర్ వెనుక ఉన్న రోడ్డు, నెల్లిచెరువు గట్టు, బైపాస్ కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు, అధికారులతో కలిసి సందర్శించారు. జెసిబిలను ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన ఇళ్లలోని ప్రజలకు మంచినీరు, భోజనం ఏర్పాటు చేయించారు. స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన చోట ప్రభుత్వం తరుపున సహాయక చర్యలు అందించేలా చూడాలని సూచించారు. ముంపునకు గురైన నివాసాలను గుర్తించి, కుటుంబానికి రూ.2 వేల నగదుతోపాటు నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలిపారు. బాధితులకు బెలగాం చర్చి వీధిలో ఉన్న డివివిఎం ప్రభుత్వ పాఠశాలలో పునరావాసాన్ని కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే జనశక్తి కాలనీ, సుందర నారాయణ పురం కాలనీ వాసులతో మాట్లాడుతూ వరహాల గెడ్డకు రక్షణగోడ నిర్మాణం చేపట్టేందుకు త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళీ, తదితరులు పాల్గొన్నారు.
వరద నీరు మళ్లించేందుకు చర్యలు
జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ముంపునకు గురైన ప్రాంతాల్లో గురువారం నీటిమళ్లింపు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజినీరింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం అధికారులతో కలిసి మూడు జెసిబిలను ఉపయోగించి వరద నీరు మళ్లించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఇంజిన్ల సహాయంతో తోడించే ప్రక్రియ చేపట్టారు. దోమలు విజృంభించకుండా ఉండేందుకు పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఎఇ జి.ఆనంద్, టిపిఒ పి.కనకారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పి.నారాయణరావు, జి.వినరుకుమార్, ప్రజారోగ్య అధికారి మురళి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
100 ఎకరాల్లో పంట మునక
ప్రజాశక్తి-వీరఘట్టం
మండలంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నడుకూరు గ్రామ సమీపంలో 100 ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. మొన్నటివరకు సాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడి మోటార్ల సహాయంతో పంటలు సాగు చేశారు. రెండు రోజులుగా వర్షాల కారణంగా సీతమ్మ సాగరం చెరువు నీరు పంట పొలాలపై ప్రవహించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, పంటలపై ఆశలు వదులుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉధృతంగా వట్టిగెడ్డ
వీరఘట్టం మండలంతోపాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో పైనుంచి వచ్చిన వరదల కారణంగా వట్టిగడ్డలో నీటి ప్రవాహం అమాంతంగా పెరిగింది. వట్టిగడ్డకు సమీపంలో నివశిస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కూడా వర్షాల కారణంగా వట్టిగడ్డలో నీటి ప్రవాహం క్రమేపీ పెరిగిపోవడంతో గృహాల్లోకి చేరింది. అప్పట్లో స్థానికులు ఎగువ ప్రాంతానికి వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ పరిస్థితి రాకముందే అధికారులు వట్టిగడ్డ పరివాహక ప్రాంతాలను సందర్శించి, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.










