ప్రజాశక్తి - కొమరాడ : స్థానిక ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి సంక్షేమ హాస్టల్ లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రోజుల తరబడి తిరగలేక మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థితి ఉందని, కావున కొమరాడలో పోస్టుమెట్రిక్ హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.పండు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన సైకిల్ సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజున కొమరాడకు చేరింది. ఈ యాత్రకు సిఐటియు, గిరిజన, రైతు సంఘం, ఆశా, అంగన్‌వాడీ, వ్యవసాయ కార్మికసంఘాల నాయకులు కొల్లి సాంబమూర్తి, కె.గౌరమ్మ ఎ.ఉపేంద్ర, వెంకటేష్, త్రినాధ, ఆరుద్ర, రాజేశ్వరి, సుజాత, గౌరి, దుర్గమ్మ, కుమారి ఘనస్వాగతం పలికి, సంఘీభావం తెలిపారు. ఈ సంద్భంగా స్థానిక విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి డి.పండు, పి.రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేలా తమ విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మండల కళాశాలకు పోస్టుమెట్రిక్ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు రోజుల తరబడి 20 కిలోమీటర్ల వరకు సైకిళ్లు తొక్కుకుంటూ, నదులపై పడవలతో దాటుకుంటూ వస్తున్నారని దీనివల్ల ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కావున మండల కేంద్రంలో పోస్టుమెట్రిక్ హాస్టళ్లను నిర్మించాలని, కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, నాన్ టీచింగ్ లెక్చరర్లను నియమించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మండల కేంద్రంలో డైట్ కళాశాల ఏర్పాటుకై ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ హాస్టళ్లకు బకాయిలుగా నిలిచిన మెస్ ( డైట్ ) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకువచ్చిన హనర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్న షిప్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని, ఎన్‌ఇపి రద్దు చేయాలని, 117 జిఓ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో పర్మినెంట్ వర్కర్లను, వార్డెన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టల్‌కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఎఎన్‌ఎంలను నియమించాలని లేనిచో సైకిల్‌యాత్ర అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాజు, హెచ్. సింహాచలం, బి.గంగారావు, కె.భాస్కరరావు, నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం చేరుకున్న సైకిల్‌యాత్ర
పార్వతీపురంరూరల్ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సైకిల్ సంగ్రామ యాత్ర స్థానిక పాత బస్టాండ్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంది. విద్యార్థులకు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, మున్సిపల్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ నాయకులు పడాల గాంధీ, నాగవంశం నిర్మల, షాపు వర్కర్స్ యూనియన్ నాయకులు చొక్కాపు మౌళి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వరి, ఎం.గౌరీ, అంగన్వాడీ వర్కర్స్ స్వాగతం పలికి వీర తిలకం దిద్ది ఆహ్వానించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పడాల రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో పాచిపెంట నుంచి పార్వతీపురం వరకు 15మండలాల్లో సైకిల్ సంగ్రామ యాత్ర కొనసాగిందన్నారు. జిల్లాలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుందన్నారు. ఈ ఆందోళనలో భాగంగా బుధవారం స్థానిక సుందరయ్య భవనం నుండి పాత బస్టాండ్ వరకు సైకిల్ యాత్ర ముగింపు ఉంటుందన్నారు. సిఐటియు నాయకులు గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేసే ఆందోళనకు సిఐటియు మద్దతు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పండు, భాస్కరరావు, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.










