Oct 12,2023 00:34

పాడేరులో సమస్యలనను తెలియజేస్తున్న విఒఎలు

ప్రజాశక్తి -యంత్రాంగం: 

పాడేరు :
పాడేరు ఐటిడిఏ ఎదుట మంగళవారం 36 గంటల నిరవధిక ధర్నా చేపట్టిన వెలుగు వివోఏలు రెండో రోజు బుధవారం కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. ధర్నా శిబిరం నుంచి వివోఏలు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలి వెళ్లారు. కలెక్టర్‌ కార్యాలయం గేటు ముందు బైఠాయించిన వివోఏలు నిరసన గళంతో తమ సమస్యలపై నినదించారు. వెలుగు ఏపీడిని వివోఏలు నిలదీశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించారని పైగా విధి నిర్వహణలో తమకు ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. వివిధ మండలాల నుంచి వచ్చిన వివోఏల నిరసనలతో కలెక్టరేట్‌ ప్రాంగణం మార్మోగింది.
సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ,ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కరించకుంటే మనమే ప్రభుత్వాన్ని గద్దె దించుదామని, ఆరు నెలల్లో ఎన్నికలు రాబో తున్నాయని సమస్య పరిష్కారం చేసేంత వరకు వెలుగు వివోఎల పోరాటం ఆపేది లేదన్నారు. విఓఎల సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, 36 గంటల ఐటీడీఏ ముందు వంటావార్పు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గమన్నారు. వివోఏ లతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితి సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, పది లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. బకాయి పడ్డ జీతాలు చెల్లించి, కార్మికుల కనీస వేతనాలు 26,000 అమలు చేయాలన్నారు. అధికారుల వేధింపులు వెంటనే ఆపి, అనారోగ్యంతో ఉన్న విఏఓల కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఏపీఎం, సీసీలు వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
స్పందించిన వెలుగు ఏపిడి మురళి బయటకు వచ్చి వివోఏల నుంచి సమస్యలపై వినతి పత్రం తీసుకొని పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని వివరించారు. ఏపీఎంలు, సీసీలు వేధింపుల పై స్పందించిన పీడీ శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వ్యక్తిగతంగా తమకు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. కలెక్టర్‌ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని బయటికి వచ్చి తమ సమస్య పై మాట్లాడాలని డిమాండ్‌ చేయగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తాను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెలుగు వివోఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు భాను,.రవి కుమార్‌, శేఖర్‌, ఎల్‌ సుందర్రావు, జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొనసాగిన విఒఎల నిరసన దీక్ష
చింతూరు : సమస్యల పరిష్కారానికి వెలుగు విఒఎల 36గంటల మమాధర్నాను చింతూరు ఐటిడిఎ ఎదుట కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొమరం పెంటయ్య మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పన, పెండింగ్‌ వేతనాలు చెల్లింపు వంటి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లోకో యాప్‌ నిర్వహణకు 5జి ఫోన్‌లు ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరేకు అందించారు. కార్యక్రమంలో లీలా, రత్నకుమారి, జ్యోతి, మణి, కుమారి, వెంకటరమణ, లక్ష్మి, రాము, రామకృష్ణ, సీత పాల్గొన్నారు
రంపచోడవరం : వెలుగు విఒఎ(యానిమేటర్స్‌) 36 గంటల ధర్నాలో భాగంగా రెండవరోజు బుధవారం వంటావార్పు నిరసన చేపట్టారు. ఏడు మండలాలకు చెందిన300 మందికి పైగా విఒఎలు పాల్గొని, రోడ్డుపైనే వండి, భోజనాలు చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు.వెంకట్‌, జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ విఒఎలకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యం చేశారని, ఇప్పటికైనా స్పందించంకుంటే తగు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తక్షణం స్పందించకుంటే చలో విజయవాడ ఆందోళన, నిరవధిక సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు. కె.ఎర్రంపాలెం విఒఎ వెంకటలక్ష్మిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటిడిఎ ఎఒకు అందజేశారు.