ప్రజాశక్తి -పెనుకొండ : పోరాటాల ద్వారానే ఇళ్లస్థలాలు సాధించుకుందామని ఐద్వా జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్షాద్ అన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి గౌతమి అధ్యక్షతన పట్టణంలో ఎస్సీ బాలుర హాస్టల్ ఆవరణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేద మహిళలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఐద్వా జిల్లా గౌరవ అధ్యక్షులు దిల్షాద్ మాట్లాడుతూ కియా, ఇతర పరిశ్రమలు పెనుకొండ పట్టణం చుట్టూ రావడంతో పేదల సొంతింటి కల గగనమైందనన్నారు. భూమి విలువ అమాంతం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బాడుగ ఇంటిలో ఉంటూ రోజువారి కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకోవడమే భారమై బాడుగలు కట్టుకోలేని దీనస్థితిలో ప్రజలు ఉన్నారన్నారు. మరోవైపు విలువైన ప్రభుత్వ స్థలాలు కొంతమంది రాజకీయ పలుకుబడి ఉపయోగించే ఆక్రమణలు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వందల మంది ఇళ్లు లేని నిరుపేదలు వ్యక్తిగత అర్జీలను మున్సిపల్ కమిషనర్ నుంచి కలెక్టర్ వరకు సమర్పించినా కనీస చర్యలు తీసుకొని స్థలాలు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. దీనిబట్టి చూస్తే పేదల పట్ల అధికారుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందని విమర్శించారు. సమస్యల పరిష్కారం పట్ల మహిళలు చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద మహిళలు అనేక నిరసనలు, విజ్ఞప్తులు చేసినా అధికారుల్లో చలనం లేదన్నారు. మనం స్థలాలు సాధించుకోవాలంటే గుడిసెలు వేయడమే మార్గమని అన్నారు. అనంతరం తహశీల్దార్‌ని కలిసి సమస్యను వివరించారు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని 90 రోజులు పూర్తయిందని తక్షణం ఇళ్ల స్థలాలు చూపించాలని కోరారు. తహశీల్దార్ స్పందిస్తూ పై అధికారుల నుండి ఇంకా ఆదేశాలు రాలేదని వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అంతవరకు ప్రభుత్వ స్థలాల్లో తాము గుడిసెలు వేసుకుంటామని ఆతర్వాత జరిగే పరిణామాలకు అధికారులు బాధ్యత వహించాలని నాయకులు హెచ్చరించారు. అనంతరం ఇండ్ల స్థలాల సాధన కోసం ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులుగా జిగిని, ముబీన లతో పాటు పట్టణ కమిటీ సభ్యులుగా 12 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, సిపిఎం స్థానిక నాయకులు తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.










