ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు పోలా రామాంజనేయులు ఆశయ సాధనకు కృషి చేస్తామని వృత్తి సంఘాల జిల్లా నాయకులు పి.గోవిందు, చేనేత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామర్తి లక్ష్మన్న, భరణి కాలప్ప తెలిపారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో రామాంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోలా రామాంజనేయులు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేశారని కొనియాడారు. గతేడాది అక్టోబర్ 2న ఎమ్మిగనూరులో జరిగిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో పోలా రామాంజనేయులు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారని తెలిపారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. చేనేత కార్మికులకు ఆయన చేసిన సేవలు మరువరానివని తెలిపారు. చేనేత కార్మికుల సమస్య పరిష్కారం కోసం పని చేసిన పోలా రామాంజనేయులు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చేనేత కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒకప్పుడు దేశానికే పేరెన్నిక గన్న ఎమ్మిగనూరు చేనేత సొసైటీ నేడు కకావికలమైందని పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో చేనేత నేసిన చీరలను కొనుగోలు చేసే ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి చేనేత కార్మికుడికీ 'నేతన్న నేస్తం' అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయడంలో సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. చేనేత కార్మిక సంఘం నాయకులు ఎం.రాజు, ఎం.ఎల్లప్ప, ఎస్.శ్రీను, ఎం.తిమ్మప్ప, బి.నాగరాజు, కె.కృష్ణ, సిఐటియు నాయకులు రాముడు, రాజు పాల్గొన్నారు.
పోలా రామాంజనేయులుకు నివాళులర్పిస్తున్న నాయకులు










