Apr 09,2023 22:27

medical


ఆరేడు నెలలుగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాల్లేవ్‌..
అప్పులతో కుటుంబాలనకు నెట్టుకొస్తున్న వైనం
ప్రజాశక్తి-గన్నవరం
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై కనికరం చూపించటం లేదు. నెలల తరబడి జీతాలు చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుండటంతో ఆయా కుటుంబాలు అప్పుల ఊబిలోకి నానాటికీ నెట్టేయబడుతున్నాయి. ఉద్యోగంగా చేరి ఏడాదైన వారికి కూడా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విభాగాల్లో జీతాలు రాకపోవటంతో వారు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ఇతర విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విభాగాల్లో ఉద్యోగులను తీసుకుంది. వీరిలో కొన్ని విభాగాల్లోని ఉద్యోగులకు జీతాలు అందకపోవటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాకపోవటంతో కొందరు ఈ ఉద్యోగం వదలి మరో ఉద్యోగాల్లో చేరిపోతున్నా ఉదంతాలు కూడా ఉంటున్నాయి. ప్రభుత్వ విభాగంలోని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కావటంతో ఎప్పుటికైనా క్రమబద్ధీకరణ జరుగుతుందనే ఆశోతో మరికొందరు అప్పులు చేసి మరీ కుటుంబాలకు నడుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో గతేడాది భర్తీచేసిన ఉద్యోగులకు జీతాలు చెల్లించటం లేదు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో గతేడాది ఆగస్టు నుంచి మూడు, నాలుగు దఫాలుగా ఉద్యోగుల భర్తీ జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పద్ధతిలో ఉద్యోగాలభర్తీ జరిగింది. డిఎఅండ్‌ హెచ్‌ఒ, డిసిహెచ్‌ఎస్‌, జిఎంసి, జిజిహెచ్‌లలో అటెండరు నుంచి టెక్నీషియన్‌ వరకూ వివిధ హౌదాల్లో ఉద్యోగాల భర్తీ జరిగింది. అయితే ఉద్యోగాల్లో చేరిన నిరుద్యోగులు జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు. గత ఏడు నెలలుగా వీరంతా పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆరేడునెలలు దాటినా ఒక్క జీతం కూడా వీరు కళ్లారా చూడలేదు. గతంలో వివిధ ప్రయివేటు సంస్థలు, సొంతంగా ఏవో ఉపాధి పనులు చేసుకుంటూ వీరు ఉద్యోగాలకు దరఖాస్తులు చేశారు. కానీ వారి ఆశలపై రాష్ట్రప్రభుత్వం నీళ్లు చల్లినట్లయ్యింది. ఉద్యోగం వచ్చినా జీతాలు రాకపోవటంతో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు బయట ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద డబ్బులు తీసుకుని కుటుంబాలు గడుపుతున్నారు. మహిళా విభాగం నుంచి చేరిన ఉద్యోగినుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పనిచేస్తున్నా జీతం ఎందుకు రాదంటూ ఇంట్లో భర్త, అత్తింటివారు, పుట్టింటివారు సైతం ప్రశ్నిస్తున్న ఉదంతాలు ఉంటున్నాయి. మరికొందరు అనారోగ్యంతో బాధపడేవారు, ప్రెగెన్సీలతో ఉన్న వారు జీతం డబ్బులు రాకపోవటంతో దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్న చందంగా వారి జీవితాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు తక్షణమే జీతాలు మంజూరుచేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
పొమ్మన కుండా పొగ పెట్టిన చందం
రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా జీతాలు మాత్రం విడుదల చేయటం లేదు. మొదటి నాలుగైదు నెలలు వేచిచూసినా ఫలితం లేకపోవటంతో కొంతమంది ఉద్యోగులు ఈ ఉద్యోగాన్ని వదిలేసి ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకుంటున్న వారూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. పొమ్మనకుండా పొగపెట్టిన చందంగా రాష్ట్రప్రభుత్వం పేరుకే ఉద్యోగులను నియమించింది. కానీ ఆచరణలో జీతాలు ఇవ్వకుండా వారంటత వారే మళ్లీ మానివేసే పరిస్థితులు సష్టిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. కేటాయించిన విభాగాల్లో డ్యూటీలు వేయకుండా ఇతర విభాగాల్లో వేస్తుండటంతో ఉద్యోగులు, అందులోనూ పలుచోట్ల మహిళా ఉద్యోగినులు పై అధికారులు, విభాగాల హెడ్‌ల నుంచి వేధింపులకు గురౌతున్న ఉదంతాలు కూడా చాలా జిల్లాల్లో జరిగినట్లుగా ఉదంతాల ద్వారా తెలుస్తోంది.
క్రమబద్ధీకరణ ఎప్పుడో? : అమలుకు నోచని సిఎం హామీ
ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో చట్టాలను అమలు చేయటం లేదు. కాంట్రాక్టు లేబర్‌ (అబాలిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం-1970 ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాల్సివుంది. అంటే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా బేసిక్‌, డిఎ, హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ, సెలవులు, జిపిఎఫ్‌, హెల్త్‌ కార్డులు తదితర అన్ని సౌకర్యాలు వర్తింపచేయాల్సివుంది. 'అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు పెంచుతామనీ, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని వైసిపి పాలకులు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవటం లేదు. తాను సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే పలు సందర్భాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సేవలందించని ప్రభుత్వ కార్యాలయం, ఆఫీసు, ఆసుపత్రి, స్కూళ్ళు లేవు. కానీ పాలకులు చట్ట ప్రకారం వారికి రావాల్సిన వేతనాలు, సౌకర్యాలు అమలు చేయడం లేదు. ఇటీవల సిఎంతో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో కూడా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించారు. తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్నట్లుగా సిఎం మళ్లీ ప్రస్తావించారు. కానీ రాబోయేకాలంలో ఏమి చేస్తారో వేచిచూడాల్సిందే.