ప్రజాశక్తి - హాలహర్వి
తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికరాదాయం, నాణ్యమైన దిగుబడి పొందడం పొలంబడి ముఖ్య ఉద్దేశమ్యమని ఎఒ శివశంకర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని బిలేహళ్ గ్రామంలో గంగాధర్ గౌడ్ పత్తి పంట పొలంలో పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ సిద్ధమైన వనరులతో సాగు చేయడం పొలంబడి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భూసార పరీక్షను బట్టి ఎరువులు వాడాలని చెప్పారు. వానపాములు, సేంద్రీయ ఎరువులు వాడాలని, రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు. విత్తన శుద్ధితో చీడపీడలను నివారించవచ్చని తెలిపారు. అంతర పంటల ద్వారా మిత్ర పురుగులను వృద్ధి చేయవచ్చని చెప్పారు. ఎర పంటలు, లింగాకర్షక ఎరలను వాడి పురుగుల ఉనికిని గమనించవచ్చని తెలిపారు. బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత మందులు, వేపగింజల కషాయంతో శత్రు పురుగులను నివారించవచ్చని చెప్పారు. రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించాలని తెలిపారు. రైతులు, విఎఎ రాజేంద్ర, వాలంటీరు ప్రభాకర్ పాల్గొన్నారు.
పొలంబడి నిర్వహిస్తున్న అధికారులు










