ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : బహిరంగ ప్రదేశాలలో ధూమపానం, పాఠశాలలు, కళాశాలలు సమీ పంలో పొగాకు ఉత్పత్తులు, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పి జాషువా హెచ్చరించారు. కాట్పా చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమన్నారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో (ఎన్టిసిపి) భాగంగా స్థానిక పోలీసు కార్యాలయంలో గురువారం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం కాట్పాని ప్రభావవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రజా ఆరోగ్యశాఖ, సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో జిల్లా పోలీసు అధికారులకు సమగ్ర శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం మత్తు కలిగించే పదార్థాలు, మద్యం, పొగాకు ఉత్పత్తులు, సైకోట్రోపిక్ పదార్థాన్ని కలిగిన ఉత్పత్తులను తగిన అర్హత కలిగిన వైద్యుల ఆదేశానుసారం మాత్రమే ఇవ్వాలని, ఇతర ఏ సందర్భాల్లోనైనా పిల్లలకు ఇచ్చినా, ఇవ్వడానికి కారణమైనా ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ లక్ష జరిమానా విధించబడుతుందని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నో స్మోకింగ్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్విడి ప్రసాద్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 48 వేల మరణాలు సంభవిస్తున్నా యని తెలిపారు. కాట్పా చట్టంలోని సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకి 100 యార్డులు (300 ఫీట్ల) పరిధిలో పొగాకు విక్రయించడం నిషేధం అన్నారు. వాయిస్ ఆఫ్ టొబాకో వీక్టీమ్స్ (విఓటివి) పాట్రన్ పొగాకు వాడకం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై మాట్లాడుతూ అన్ని రకాల క్యాన్సర్లలో 40 శాతం పొగాకు వల్లనే వస్తుందని, 90 శాతం నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు నేరుగా పొగాకు ఉత్పత్తుల వాడకంతోనే వస్తున్నాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఎన్టిసిపి) డా. ఇ ప్రశాంత్, జిల్లా పోలీసు అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్యశాఖ అధికారులు, సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.










