ప్రజాశక్తి - సీతంపేట : ఇంకా ప్రారంభం కాని ఇంజనీరింగ్ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పన కుమారి అన్నారు. బుధవారం పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎపిఇపిడిసిఎల్, హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పీవో మాట్లాడుతూ పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని సూచించారు. హౌసింగ్ లే అవుట్లలో నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు, డిఇలు లోకనాథం, ఢిల్లీశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిజిఎంపి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరు చేసిన పనులు వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరు చేసిన పనులు ప్రగతిపై పార్వతీపురం, కొమరాడ మండల అధికారులతో ఐటిడిఎ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరు చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లింపు జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఆయా పనుల ప్రాధాన్యత ఉందని దాని దృష్ట్యా వేగవంతం చేయాలని అన్నారు. మెటీరియల్ సరఫరా, ఇతర అంశాల పట్ల స్పష్టమైన కార్యాచరణ ఉండాలన్నారు. వర్షాలకు ముందుగానే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.










