Sep 27,2023 21:50

మాట్లాడుతున్న డిఆర్‌ఒ వెంకటరావు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : ఆదాయపు పన్ను చెల్లింపులో ఎటువంటి అశ్రద్ధ చూపవద్దని ఆదాయ పన్ను శాఖ అధికారి జి.రవిశంకర్‌ అన్నారు. ఆదాయ పన్ను శాఖ టిడిఎస్‌పై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిడిఒలు తమ సబ్బంది జీతభత్యాలు నుంచి ప్రతినెలా ఆదాయపన్ను మినహాయించాలని సూచించారు. ఆదాయపన్ను చెల్లించడంతో అలసత్వం వహిస్తే అపరాధ రుసుం పడుతుందని స్పష్టం చేశారు. ఆదాయపన్ను చెల్లింపులో అప్రమత్తంగా ఉండాలన్నారు. టిడిఎస్‌లో వివిధ దశలు ఉంటాయని ట్రెజరీ అధికారులకు తెలియజేశారు. ఆదాయపు పన్ను చెల్లింపులో పాన్‌ తదితర వివరాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. డిడిఒలు ఏ ఉద్యోగికీ మినహాయింపు ఇవ్వరాదన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలు కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో విధిగా ఆదాయపు పన్ను చూపించాలని తెలిపారు. డిఆర్‌ఒ జె.వెంకటరావు మాట్లాడుతూ టిడిఎస్‌పై అవగాహన లేకపోవడం వల్ల భవిష్యత్తులో డిడిఒలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిడిఒలు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయఒ ఎఒ ఆర్‌.ఉమామహేశ్వరరావు, జిల్లా ఖజానా అధికారి ఎ.మన్మథరావు, ఆదాయపు పన్ను ఇనస్పెక్టర్లు పి.ఉమామహేశ్వరరావు, పి.వి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.