May 25,2023 20:36

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌, వైద్యాధికారులు

పని చేయని డిజిట్‌ ఎక్స్‌రే మిషన్లు
- వినియోగానికి చర్యలు తీసుకోండి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్‌ నివేదన
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       జిల్లాలోని 13 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన ఎక్సరే మిషన్లు కంప్యూటెడ్‌ రేడియాగ్రఫీ సిస్టం పని చేయని కారణంగా డిజిటల్‌ ఎక్సరేలు వినియోగంలో లేవని జిల్లా కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌ తెలిపారు. వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డికి నివేదించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి స్పందన అర్జీల పరిష్కారం, భూముల రీ సర్వే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, నాడు-నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ ఛాంబర్‌ నుండి జిల్లా కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్‌ థియేటర్‌ సంబంధించిన పరికరాలను కూడా పంపిణీ చేయాల్సిందిగా కోరారు. ఎక్సరే మిషన్లకు సంబంధించి రాష్ట్రస్థాయిలో సంబంధిత కంపెనీ ఏజెన్సీలకు ఎక్సరే మిషన్ల టెక్నికల్‌ సమస్యలు తొలగించమని సూచించామని సంబంధిత ఆరోగ్య శాఖ కార్యదర్శి కలెక్టర్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణ పనుల్లో 30 శాతం మాత్రమే నిధులు ఖర్చు పెట్టారని, ఈ నెలాఖరులోపు మిగిలిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలలో భాగంగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలు ఇప్పటివరకు 32 పూర్తి చేశారని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకా ప్రారంభించని హెల్త్‌ క్లినిక్‌లను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ విద్యాలయాల్లో చదివేందుకు అడ్మిషన్స్‌ తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం కింద కాంటాక్ట్‌ ఆపరేషన్లు అన్ని మౌలిక వసతులున్న ప్రభుత్వ, ప్రవేట్‌ హాస్పిటల్లో చేయించేందుకు చర్యలు తీసుకోవాలని వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ను ఆదేశించారు.