చిలమత్తూరు :సక్రమంగా విధులు నిర్వహించమంటే మండల వైద్యాధికారిపై ఫిర్యాదు చేయడం తగదని డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ మంజువాణి చిలమత్తూరు ప్రభుత్వ వైద్య సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల మండల రెండవ మెడికల్ ఆపీసర్‌గా ఉన్న మహిళా వైద్యురాలు ఫామిలీ ఫిజీషియన్ కార్యక్రమానికి వెల్లిన తరుణంలో రోగులకు వైద్యసేవలు అందించకుండా గోలీల ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తున్న వీడియో వైరల్ అవ్వడంతో ఆ విషయంపై శుక్రవారం నాడు విచారణ చేపట్టారు. ఈ విషయంపై విచారణ జరుగుతుండగా మండల వైద్యాధికారి రామకృష్ణ తమకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని సిబ్బంది డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెళ్లిన చోట గ్రామీణులకు వైద్యసేవలు అందించకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తాను విచారణకు వస్తే దానికి సమాధానం ఇవ్వకుండా వైద్యాధికారి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఫిజీషియన్‌కు వెల్లి అక్కడ గ్రామంలో గోలీలు ఆట ఆడడం ఏమిటని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా విధులను నిర్వహించిన రెండవ మెడికల్ ఆఫీసర్, 104 సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆమె విలేకరులకు తెలియజేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. కాగ చిలమత్తూరు మెడికల్ ఆపీసర్ డాక్టర్ రామకృష్ణ విధి నిర్వహణలో నిఖచ్ఛిగా వ్యవహరిస్తుండడంతో కొందరు కింది స్థాయి సిబ్బంది కావాలనే ఆయనపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.










