Oct 20,2023 21:06

రైతులతో మాట్లాడుతున్న ప్రదీప్‌ రెడ్డి

ప్రజాశక్తి - కౌతాళం
ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు సాగునీరందక కళ్ల ముందరే ఎండిపోతున్నాయని, కాపాడాలని మండలంలోని హాల్వి, గోతులదొడ్డి, అగసలదిన్నె రైతులు వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.ప్రదీప్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శుక్రవారం మండలంలోని కామంరం గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయో, ఇంకా ఎవరైనా అర్హులైన వారు ఉంటే వారికి అందించడానికి కృషి చేస్తామని ప్రదీప్‌ రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలుంటే స్థానిక నాయకులు వీర సేనా రెడ్డి, మహేందర్‌ రెడ్డి దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం హాల్వి, గోతులదొడ్డి, అగసలదిన్నె రైతులు అక్కడికి వచ్చి తమ ఆయకట్టు నీటి సమస్య గురించి వివరించారు. హాల్వి గోతులదొడ్డి గ్రామాల్లో 860 ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు సాగు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చుక్క నీరు కూడా ఆయకట్టుకు రాలేదని, పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఎలాగైనా సాగునీరందించి కాపాడాలని కోరారు. రైతుల సమస్యలు విన్న ప్రదీప్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి తుంగభద్ర దిగువ కాలువ అధికారులతో చర్చించారు. వారం రోజుల్లో ఆయకట్టుకు సాగునీరందించి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సహకారంతో తుంగభద్ర దిగువ కాలువ నీరందించి పంటలు కాపాడతామని హామీ ఇవ్వడంతో రైతులు సంతోషించారు. వీరసేనారెడ్డి, వెంకట్‌ రెడ్డి, ఎంపిపి అమ్రేష్‌, సర్పంచి వసంత కమార్‌, ఎంపిడిఒ సుబ్బరాజు పాల్గొన్నారు.