Sep 20,2023 21:03

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
           2023-24 పంటల బీమాను ప్రయివేటు కంపెనీలకు అప్పగించొద్దని, రాష్ట్ర ప్రభుత్వమే తన బాధ్యతగా పంటల బీమా పథకాన్ని నిర్వహించాలని ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ కోరింది. పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 660ను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణకు వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో రైతు సంఘం నాయకులు, రైతులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ పంటల బీమాలో ప్రయివేటు బీమా కంపెనీల ప్రవేశం నిలిపివేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా అమలు చేయాలని కోరారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బీమా కంపెనీలతో బిడ్డింగ్‌ నిర్వహించిందన్నారు. పంటల బీమా విధానం రైతులకు నష్టం చేసేది గాను, బీమా కంపెనీల ప్రయోజనాలకు ఉపయోగపడేదిగా ఉందన్నారు. 2020 నుండి 2023 వరకూ మూడు సంవత్సరాల పంటల బీమా అమలు అనుభవం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంటల బీమా అమలు చేసిన 2020-21లో రూ.1700 కోట్లు, 2021-22లో రూ.2,900 కోట్లు రైతులకు పంటల బీమా రూపంలో ప్రయోజనం కలిగిందని చెప్పారు. 2022-23లో బీమా పథకం వల్ల రైతులకు కేవలం రూ.1100 కోట్లు మాత్రమే పరిహారం వచ్చిందని చెప్పారు. ఈ అనుభవం దృష్ట్యా పంటల బీమాలో ఇన్స్యూరెన్స్‌ కంపెనీల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగి పంటల బీమా పథకంలో ఇన్స్యూరెన్స్‌ కంపెనీలను అనుమతించొవద్దన్నారు. ప్రధాన మంత్రి ఫసలీ బీమా పాలసీ ఇన్స్యూరెన్స్‌ కంపెనీల లాభాల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గండి రాజా, నున్న శేషగిరిరావు పాల్గొన్నారు.