పంటల బీమాలో దగాపడ్డ రైతులు
: ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి - ఆత్మకూరు
పంటల బీమాలో రైతులు తీవ్రంగా దగాపడ్డారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం ఆత్మకూరు మండల కార్యదర్శి వీరన్నలు అన్నారు. బుధవారం నాడు వారు మాట్లాడుతూ 2022-23లో నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, మినుము, కంది, పత్తి, మిరప, ఉల్లి, వరి తదితర పంటలను రైతులు విస్తారంగా సాగు చేయగా వాతావరణ పరిస్థితులు వల్ల పంటలు దెబ్బతిని భారీగా నష్టపోయారన్నారు. నష్టపోయిన పంటలన్నిటికీ బీమా వర్తింపజేసి రైతుల అకౌంట్లో వేస్తున్నట్లు ఆర్‌బికెల్లో రైతుల జాబితా గోడలు అతికిస్తామని ప్రభుత్వం చెప్పి, ఆర్‌బికెల్లో ఎక్కడ రైతుల జాబితా గోడకు అతికించలేదని వారు అన్నారు.
ఆత్మకూరు మండలంలో నల్ల కాల్వ, బాపనంతాపురం ,కరివేన గ్రామాల్లోని ఆర్‌బికెల్లో వారు పరిశీలించారు. నల్లకాలువ గ్రామంలో వారు అధికారిని విచారిస్తే 25 మందికి పైన ఉల్లి రైతులకు నష్టపరిహారం వేస్తున్నారని తెలియజేయగా.. వాస్తవంగా గ్రామ రైతులు విచారిస్తే గ్రామంలో 98 శాతం రైతులు మొక్కజొన్న పంట వేశారని, రైతుల పేర్లు ఎక్కడ కనబడడం లేదని, గ్రామంలో ఉల్లి పంట ఒక్కరు కూడా వేయలేదని పేర్కొన్నారు. అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొందని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆర్‌బికెల్లోనూ అన్ని పంటల విత్తనాలు అందుబాటులో లేవని, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వకపోతే ఆందోళన చేయవలసి వస్తుందని వారు హెచ్చరించారు.










