Aug 29,2023 19:52

పంటలను పరిశీలిస్తున్న రమేష్‌ నాయక్‌, ఎఒ వరప్రసాద్‌

ప్రజాశక్తి -పెద్దకడబూరు
పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.రమేష్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం ఎఒ ఎం.వర ప్రసాద్‌తో కలిసి నౌలెకల్‌, బసలదొడ్డి, గ్రామాల్లో పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలను పరిశీలించారు. చీడపీడలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిరపలో పైముడత, ఎండు తెగులు, వేరుపురుగు, జెమిని వైరస్‌ను గమనించినట్లు తెలిపారు. పత్తిలో పూత, పిందె రాలడం, గులాబీరంగు పురుగు ఉనికిని గమనించినట్లు చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మిరప పంటలో పైముడత, కింద ముడత నివారణకు ఎకరాకు స్పైరొమేసిఫిన్‌ ఎ 160 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెనాపైర్‌ ఎ 400 మిల్లీలీటర్లు పిచికారి చేయాలని తెలిపారు. ఎండు తెగులు నివారణకు ఎకరాకు 4 కిలోల చొప్పున ట్రైకోడెర్మా, సూడోమోనస్‌ను 100 కిలోల పశువుల ఎరువులో కలిపి పొలమంతా చల్లాలని సూచించారు. వేరు పురుగు నివారణకు 8 కిలోల క్లోరిపైరిఫొస్‌ 10జి గుళికలను చల్లుకొని తర్వాత నీళ్లు పెట్టాలన్నారు. జెమినీ వైరస్‌ సోకిన మొక్కలను తీసి వేయాలని తెలిపారు. వైరస్‌ కారకమైన తెల్లదోమను నివారించేందుకు ఎసిఫేట్‌ ఎకరాకు 300 చొప్పున పిచికారి చేయాలని చెప్పారు. మందులతో పాటు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు కంచె పంట, ఎరపంట, జిగురు అట్టల వాడకం తప్పనిసరి అని తెలిపారు. పత్తి పంటలో పూత, పిందెలు రాలకుండా లీటరు నీటికి 10 గ్రాముల 13.0.45, 3 గ్రాముల ఫార్ములా ఫోర్‌, ప్లానోఫిక్స్‌ (4.5 లీటరు నీటికి 1 మిల్లీలీటర్లు) కలిపి పిచికారి చేయాలని సూచించారు. గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలని, మూడు రోజులు వరుసగా 8 పురుగులు గమనించినప్పుడు సిఫార్సు చేసిన మందులు పిచికారి చేసుకోవాలని తెలిపారు. బెట్ట పరిస్థితుల్లో లీటరు నీటికి 10 గ్రాముల 13.0.45 లేదా 10 గ్రాముల యూరియా పిచికారి చేసుకొని, పరిస్థితి అలాగే కొనసాగితే 5 రోజుల వ్యవధిలో మళ్లీ పిచికారి చేయాలన్నారు.