హిందూపురం : పట్టణ వ్యాప్తంగా ఉన్న పందుల పెంపకం దారులు పందులను పట్టణంలో వదిలితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హెచ్చరించారు. శనివారం నాడు తమిళనాడుకు చెందిన వారితో పట్టణంలోని నేతాజీనగర్, ధర్మపురం, మోడల్ కాలనీ, రహమత్ పురం, శ్రీకంఠాపురం, మేళాపురం, చౌడేశ్వరికాలనీ, ముదిరెడ్డిపల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్న పందులను పట్టి వాటిని సుదూర ప్రాంతాలకు తరలించారు. పందులు పట్టే సమయంలో పందుల పెంపకం దారులు అడ్డొచ్చి గొడవకు దిగారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో సుమారు 50 పందులను పట్టించి ఉరికి దూరంగా తరలించారు. ఈ సందర్బంగా కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే పలు మార్లు పందుల పెంపకం దార్లకు పందులను వారి సంరక్షణలో ఉంచుకోవాలని సూచించామన్నారు. ఈ సూచనలు నిర్లక్ష్యం చేసి పందులను పట్టణంలో వదులుతుండడంతో వాటిని పట్టిస్తున్నట్లు చెప్పారు. ఇకపై పట్టణంలో సంచరించే పందులను పట్టి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు వాటి యజమానులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా వార్డులలో పందుల బెడద ఎక్కువ ఉంటే శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్ శంకర్, వన్‌టౌన్, టూటౌన్ పోలీసులు, ఆయా వార్డుల మేస్త్రీలు, వార్డు శానిటేషన్ సెక్రెటరీలు పాల్గొన్నారు.










