ప్రజాశక్తి - పరిగి : మండలంలోని పరిగి, కొడిగెనహళ్లి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పరిగి కొడిగేనహళ్లి పంచాయతీ కార్యాలయం ఆయా కార్యదర్శులకు కార్మికుల సమస్యలతో కూడిన వినతులను కార్మికులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు లింగారెడ్డి, నాగరాజు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వేతన పెంపు జీవోను అమలు జరపాలని, గుర్తింపు కార్డు ఇచ్చి ఈఎస్‌ఐ,పిఎఫ్ సౌకర్యం వెంటనే అమలు చేయాలని కోరారు. పరిగి మండలంలో ఉన్న స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 9 నెలల వేతనాలు 15 రోజుల్లోగా చెల్లించాలన్నారు. మండలంలో ఉన్న పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులతో కలిసి సమస్యలు పరిష్కరించడానికి 15 రోజులు వేచి చూస్తామని అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామపంచాయతీ వర్కర్ జిల్లా అధ్యక్షులు సి సజ్జరాయప్ప హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్లు, స్వచ్ఛభారత్ కార్మికులు పాల్గొన్నారు.










