ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పలు చోట్ల శ్రమదానంతో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు.
స్వచ్ఛత హై సేవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం పాడేరు ఐటీడీఏ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ జె. శివశ్రీనివాసు మాట్లాడుతూ మన పరిసరాలు మనమే శుభ్రపరచుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం మెరుగు పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్, సర్పంచ్ ఉషారాణి, డిపిఓ కొండలరావు పాల్గొన్నారు. పెదబయలులో చెత్తా చెదారం తొలగించారు. జి.మాడుగులలో ఎంపీడీవో చంద్రశేఖర్, స్థానిక పోలీసులు పలుచోట్ల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. డుంబ్రిగుడ మండలం అరుకు పంచాయితీలో సర్పంచ్ శారద ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతగిరి మండలం కాశీపట్నంలో స్థానిక సిపిఎం జెడ్పిటిసి. గంగరాజు, ఎంపీపీ శెట్టి నీలవేణి ఆధ్వర్యాన పరిసరాల ప్రాంతాల పరిశుభ్రత పనులను చేయించారు. గంగరాజు మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశుభ్రత పాటించినప్పుడే ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టోకురు సర్పంచ్ కిల్లో. మొస్య, అనంతగిరి సోమ్మెల. రూతు, కొర్రా. సింహాద్రి, బొర్రా అప్పారావు పాల్గొన్నారు.
జికె.వీధి మండలం, సీలేరులో సిఆర్‌పిఎఫ్ 42 బెటాలియన్ డిఎస్పీ సురేష్, ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్ కెకెవి.ప్రశాంత్ కుమార్, సీలేరు సర్పంచ్ దుర్జో, ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ చేశారు. మెయిన్ బజార్లో చీపురు పట్టుకొని పరిశుభ్రత చేశారు. ఉప సర్పంచ్ కె.వల్లి ప్రసాద్, మాజీ ఉపసర్పంచ్ కె.శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. కొయ్యూరు మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఎంపిపి బడుగు రమేష్, వైస్ ఎంపిపి అంబటి నూకాలమ్మ పాల్గొన్నారు. అడ్డతీగల మండల కేంద్రంలో ఇఒపిఆర్‌డి దాని చిన్నబ్బులు, పంచాయితి కార్యదర్శి శ్రీను, సచివాలయం సిబ్బంది ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రమదానం చేశారు. విఆర్.పురం మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శివారులోని సంత సముదాయం వద్ద రోడ్ల మీద చెత్తను తొలగించి, తగలబెట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ములకాల సాయికృష్ణ, కోట్ల రామ్మోహన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.










