ప్రజాశక్తి-హిందూపురం : ప్లాస్టిక్ నిషేధం హిందూపురం పురపాలక సంఘంతో పాటు జిల్లా వ్యాప్తంగా అమలు సాధ్యమేనా..? అన్న అనుమానాలు పట్టణవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్లాస్టిక్ నిషేధం అమలులో భాగంగా దాడులు చేసి కల్పతరువుగా మార్చుకుంటారా...? ఈసారైనా కఠినంగా వ్యవహరిస్తారా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తవుతున్నాయి. ప్రపంచానికి పెనుభూతంలా మారిన ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి హానికర ప్లాస్టిక్ తయారీ, వినియోగం ఆపేయాలని సూచిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు హిందూపురం పురపాలక సంఘంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నా 13 పురపాలక సంఘాలతో పాటు అన్ని పంచాయతీలలో దీనిని అమలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్లాస్టిక్ నిషేదిస్తున్నట్లు ఆయా పురపాలక సంఘాల కమిషనర్లు చెబుతున్నారు.కొన్ని సార్లు పట్టణంలోని ఆకస్మిక దాడులు చేసి, ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేస్తున్నా కొన్ని రోజులకు షరా మాములుగా మారుతోంది. ఈసారైనా ప్లాస్టిక్ నిషేధాన్నిను పూర్తిస్థాయిలో అమలు చేస్తారా...? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 16 రకాల సింగిల్ చూజ్ ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర నిషేధించింది. ఇయర్ బడ్స్ నుంచి బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీమ్ కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగిరెట్ ప్యాకెట్లు, 100 లోపు మైక్రాన ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మల్ కోల్ వంటి 16 రకాల వస్తువులు ఉన్నాయి.
పట్టణంలో మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం : హిందూపురం పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం ప్రస్తుతం హద్దులు దాటింది. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులు మితిమీరి వినియోగిస్తున్నారు. వాటిని రోడ్లపై, కాలువల్లో పడేస్తుండటం వల్ల మురుగు కాలువల్లో మరుగు ముందుకు పోవడానికి ఇవి ప్రతిబంధకాలుగా మారాయి. రోడ్లపై వ్యర్థాలను ప్లాస్టిక్ సంచుల్లో వేయడం వల్ల అవి తిన్న ఆవులు, పందులు, కుక్కల జీర్ణవ్యవస్థ పని చేయక మృతిచెందుతునానయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణించిన జీవాల్లో 90 శాతం ఇదే కారణంగా ఉన్నట్లు పశుసంవర్థక శాఖ తేల్చింది. పెట్రో కెమికల్ ద్వారా తయారయ్యే ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు వేయడం వల్ల కార్సినోజెనిక్ అనే ఉత్పాదిక రసాయనం విడుదలై కాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి కొంత మంది ఇడ్లీ తయారీలో సైతం దీనిని వినియోగిస్తున్నారు. భూమిలో వందేళ్లయిన కరగని ఏకైక వస్తువు ప్లాస్టిక్‌గా గుర్తించిన కొన్ని అధ్యయన సంస్థలు దీనిని పూర్తిగా నిషేధించాలని సూచిస్తున్నాయి.
తనిఖీలతో సరి : పురపాలక సంఘంలో ప్లాస్టిక్‌పై నిషేధాజ్ఞలు పెట్టినప్పుడల్లా కొందరు అధికారులకు అవి ఆదాయ వనరులుగా మారుతున్నాయి. గతంలో రెండుసార్లు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులతో కొన్ని రోజులు హడావుడి చేసి వదిలేశారు. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులు యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి.
జిల్లా మొత్తం అమలయ్యేనా....?
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ప్రాంతాలలో ప్లాస్టిక్ నిషేధించాలి. ఆ మేరకు ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో హిందూపురంతో పాటు అనంతపురం కార్పొరేషన్‌తో పాటు కొన్ని పురపాలక కమిషనర్లు ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లో ఉత్తర్వులు బయటకు రావాల్సి ఉంది. ఒకేసారిగా పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే కొంత కష్టమవుతుంది. కాబట్టి ప్రజలకు అలవాటయ్యే వరకు దశలవారీగా ఈ పక్రియ చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేంద్రం సూచించిన పరిమాణం కన్నా తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ కవర్లను తయారు చేస్తున్న వారిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంతోపాటు ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తిని నిలిపివేస్తేనే చాలా వరకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
నిషేధిత ప్లాస్టిక్ వాడొద్దు
భారత ప్రభుత్వం కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. వాటిని పూర్తిగా వాడకూడదు. ఒక్కసారి వినియోగించి పడేసే కవర్లపైనే మా దృష్టంతా. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్ వినియోగంతో పాటు ఉత్పత్తిపైన నిఘా పెడుతున్నాం. ఇందుకు ప్రజల సహకారం ముఖ్యం. పట్టణ వ్యాప్తంగా ఆకస్మిక దాడులకు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. దశలవారీగా వార్డు సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను చైతన్య వంతులను చేస్తాం. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
ప్రమోద్ కుమార్
మున్సిపల్ కమిషనర్










