Aug 19,2023 21:43

పట్టుబడిన నాటుసారాతో పోలీసులు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : ప్లాస్టిక్‌ ఆట బొమ్మల చాటున నాటు సారా రవాణా చేస్తున్న వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిఐ ఎల్‌.ఉపేంద్ర తెలిపారు. ఈ మేరకు స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒడిషా నుండి ఆంధ్రాకు నాటు సారా రవాణా జరుగుతుందన్న సమాచారంతో పార్వతీపురం మండలం గోచెక్క సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానంతో ఒడిషా రాష్ట్రం కస్పవలస వైపు నుండి వస్తున్న వెదురుబుట్టలో ప్లాస్టిక్‌ ఆట బొమ్మలతో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేశామన్నారు. వెదురు బుట్ట(గరిశ)లో ఆట బొమ్మల మాటున ప్లాస్టిక్‌ క్యాన్లతో నాటు సారాను గమనించి వాహనాన్ని సీజ్‌ చేసి 120లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం పట్టుబడిన ఒడిషాలోని విక్రంపూర్‌కు చెందిన పువ్వల దిలీప్‌ను విచారించగా, నాటు సారాను సాలూరు పట్టణానికి చెందిన గొర్లి పవన్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలపడంతో ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి, సారా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో ఎస్‌ఐ రమణ, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.