Sep 01,2023 22:12

వైద్య సిబ్బందికి సూచనలు ఇస్తున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

పాలకొండ, వీరఘట్టం: ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రజలకు ఆరోగ్య తనిఖీలు, నిర్ధారణ పరీక్షలు పక్కాగా జరపాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు. వీరఘట్టం మండలం వండువలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ఏ విధమైన అనారోగ్య సమస్యలున్నా వారికి తనిఖీలు చేపట్టి చికిత్స అందజేస్తున్నారు. నిర్ధారించిన పరీక్షల నివేదికలు పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. తనిఖీలకు వచ్చిన గర్భిణీలు, బాలింతలతో మాట్లాడి వైద్య సిబ్బంది అందజేస్తున్న ఐరన్‌, కాల్షియం మాత్రలు వారు సూచించిన క్రమంలో వేసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో అందజేస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 104 వాహనం వద్దకు వచ్చే రోగులకు ఎన్‌సిడి, సిడి ఐడి నంబర్లు ఇచ్చేలా చూడాలని, రక్తపోటు, మధుమేహం గల వారికి పక్కాగా పరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా మందులు అందజేయాలని సూచించారు. ఇతర రుగ్మతలతో వచ్చే రోగులకు యూరిన్‌, కఫం పరీక్షలు జరిపి మందులు ఇవ్వాలని ఆదేశించారు.
డ్రైడే పరిశీలన
పాలకొండ పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్వహించిన డ్రైడే కార్యమాన్ని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జగన్నాథరావు పరిశీలించారు. వైద్య బృందంతో కలిసి ఇంటింటి సర్వేలో ఆయన పాల్గొని ప్రజలతో మమేకమై దోమలు పెరగకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో, ఫ్రైడే-డ్రైడే కార్యక్రమ ఉద్దేశ్యం ప్రజలకు వివరిస్తూ దోమల లార్వాలు పెరగకుండా ఇంట్లోని పూలకుండీలు, రుబ్బురోలు, పగిలిపోయిన వస్తువులు, ఫ్రిడ్జ్‌ల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు గ్రుడ్లు పెట్టి, వృద్ధి చెందుతాయని అన్నారు. వారానికి కనీసం ఒక్కసారైనా నిల్వ ఉన్న నీటిని పారబోసి శుభ్రపర్చి, దోమల వ్యాప్తిని నివారించి మలేరియా, డెంగీ మొదలగు వ్యాధులను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో బిటివాడ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ నితీషా, సూపర్‌ వైజర్‌ ఇందిరాదేవి, డెమో వై.యోగీశ్వరరెడ్డి, ఎస్‌యుఒ మోహనరావు, సూపర్‌ వైజర్లు జగదీష్‌, రమణమ్మ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.