ప్రజాశక్తి-కొమరాడ : ఇంటింటి ఓటరు సర్వే పక్కాగా నిర్వహించాలని పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని దుగ్గి, కొమరాడ, గుమడ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల పరిధిలో చేపడుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఓటర్ జాబితా సరిచేసేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుందన్నారు. ఇప్పటికే మృతిచెందిన ఓటర్లను అవసరమైన ధ్రువీకరణ పత్రాలతోపాటు తీర్మానాలతో ఓటర్ జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. వలస వెళ్లే ఓటర్లను కూడా తొలగించేందుకు అవసరమైన తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో తప్పులను సవరించేందుకు బిఎల్‌ఒల ద్వారా ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా చేరేందుకు మంచి అవకాశమన్నారు. ఇంటింటి ఓటరు సర్వేలో అలసత్వం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సిహెచ్ రాధాకృష్ణ, బిఎల్‌ఒలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటర్ సర్వే వేగవంతం
సీతంపేట : ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేస్తామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి తెలిపారు. శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఓటరు సర్వే చేపతున్నామన్నారు. మరణించిన వారి ఓట్లను తొలగించేటప్పుడు నిబంధనలు పాటిస్తున్నామన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు కోసం వచ్చిన వాటిని వెంటనే నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్లు అప్పారావు, నరసింహమూర్తి, ఎపిఒ రోషిరెడ్డి, సర్పంచ్ జి.సుందరమ్మ, తదితరులు పాల్గొన్నారు.










