పుట్టపర్తి అర్బన్ : స్పెషల్ సమ్మర్ రివిజన్ ఫైనల్ పబ్లికేషన్ నేపథ్యంలో ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. బుధవారం నాడు పుట్టపర్తి కలెక్టర్‌లోని విసి హాల్ నుంచి స్పెషల్ సమ్మర్ రివిజన్ - 2023 ఫైనల్ పబ్లికేషన్‌పై పెనుకొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, బిఎల్‌ఒలు, ఈఆర్‌ఒలు, ఏఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మర్ రివిజన్ - 2023 ఫైనల్ పబ్లికేషన్‌లో భాగంగా ఈనెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 21వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెలరోజుల పాటు నిర్వహించే సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ నేపథ్యంలో బిఎల్‌ఒలకు శిక్షణ పెండింగ్ ఉంటే పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లే ముందు సర్వే ఎలా చేపట్టాలన్న దానిపై శిక్షణ అవసరమన్నారు. బిఎల్‌ఒ విజిట్ షెడ్యూల్ అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలన్నారు. ఈనెల 21వ తేదీన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్‌లతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నారు. ఈ సర్వేలో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేందుకు వీలులేదన్నారు. సర్వే జాగ్రత్తగా చేస్తే ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపారు. మార్పులు, చేర్పులు 100 శాతం పరిశీలన చేయాలన్నారు. 4 శాతం కంటే ఎక్కువగా ఆడిషన్స్ ఉంటే ఏఈఆర్‌ఓలు పరిశీలన చేసి రిపోర్ట్ అందించాలని, 2 శాతం కంటే ఎక్కువగా తొలగింపులు (డిలీషన్స్) ఉంటే ఈఆర్వోలు పరిశీలన చేయాలని సూచించారు. వ్యక్తిగతంగా ప్రతి మార్పులు, చేర్పులను పరిశీలన చేసి రిపోర్ట్ అందించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు ఎంతవరకు నిజమో క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, కదిరి ఆర్డీవో రాఘవేంద్ర, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ పాల్గొన్నారు.










