చిలమత్తూరు : లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో రైతులకు జరిగిన అన్యాయం అంతా, ఇంతా కాదు. పరిశ్రమ ఏర్పాటు పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాగేసుకున్నారు. తీరా అక్కడ కంపెనీ ఏర్పాటు చేయకుండా రైతుల భూములను బడాపారిశ్రామిక వేత్తలు బ్యాంకుల్లో తాకట్టుపెట్టి కోట్లాది రూపాయలు కాజేశారు. అక్కడితో ఈ అవినీతిబాగోతం ఆగేలా కన్పించడం లేదు. లేపాక్షిహబ్ పేరుతో ఇప్పటికీ పొలాలు లాగేసుకునే కుట్ర జరుగున్నట్లుగానే తెలుస్తోంది. తాజాగా చిలమత్తూరు మండల పరిధిలోని పలు అన్‌సెటిల్డ్ భూములు లేపాక్షి హబ్ పేరుపై ఆన్‌లైన్‌లో మారాయి. వారం రోజుల క్రితం వరకు ఆన్‌లైన్‌లో అన్‌సెటిల్డ్ భూములుగా ఆన్‌లైన్ ఉన్నవి ఇప్పుడు లేపాక్షి హబ్‌పై చూపిస్తున్నాయి. వీటిని చూసిన రైతులు లబోదిబోమంటున్నారు. పక్కాగా రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో ఏ'మార్చేశారు'.
వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిలమత్తూరు మండలంలో లేపాక్షి హబ్ పేరుతో రైతుల భూములను తీసుకున్నారు. అతరువాత అక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. పరిశ్రమలు ఏర్పాటు చేయని నేపథ్యంలో ఆ భూములను రైతులకు వెనక్కు ఇచ్చేయాలని పెద్ద ఎత్తున సిపిఎం, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలూ జరిగాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్‌సెటిల్డ్ (వివాదాస్పద) భూములపై పెద్దల కన్ను పడినట్లు తెలుస్తోంది. చిలమత్తూరు మండల పరిధిలో అన్‌సెటిల్డ్ పేరుపై ఆన్‌లైన్‌లో ఉన్న 1075 ఎకరాల భూమి రెండు రోజుల క్రితం లేపాక్షి హబ్‌పై పేరు మార్పిడి జరిగింది. రీసర్వే పేరిట అపరిష్కత భూములకు పరిష్కారం చూపాల్సిన తరుణంలో ఉన్న భూములను ఇలా కార్పొరేట్ సంస్థ పేరిట మార్పిడి జరగడం వెనుక ఎవరి హస్తం ఉందన్నది తెలియడం లేదు. అన్నదమ్ముల వివాదాల నేపథ్యంలో కోర్టుల్లో ఉన్న భూములు, పట్టాపాసుపుస్తకం కలిగి పెద్ద అడంగల్, ఆన్‌లైన్ 1బి చేసుకోని భూములు అన్‌సెటిల్డ్‌గా ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఈ భూములన్నీ ఖాతా నెంబర్ ''123456'' గా అపరిష్కత భూముల జాబితాలో ఉంటాయి. 1-బిలోనూ వీటి వివరాలు అన్‌సెటిల్డ్ అనే చూపిస్తుంటాయి. ఇలాంటి భూమి చిలమత్తూరు రెవెన్యూ పొలంలో సుమారు 1388 సర్వేనెంబర్లలో 1200 ఎకరాలకుపైనే ఉంది. ప్రస్తుతం ఇలాంటి భూముల్లో దాదాపు 1075 ఎకరాలు 1-బిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుపై చూపిస్తోంది. ఇది చూసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అన్‌సెటిల్డ్ కింద ఉన్న భూముల రికార్డులు ఎలా మారాయంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
సాంకేతిక లోపమో..? బోగస్ కంపెనీలకు సాయమో..?
అన్‌సెటిల్డ్ కింద ఉన్న భూములు ఒక్కసారిగా లేపాక్షి హబ్ పేరుతో ఆన్‌లైన్‌లో రావడంపై సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెవెన్యూ అధికారులకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా 1-బి జాబితాలో పేర్లు మారే అవకాశం లేదు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యి ఎకరాల భూమి ఓ కార్పొరేట్ కంపెనీ పేరుపై రావడం వెనుక పెద్దల హస్తం ఉంటుందనే అనుమానాలు బలంగా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం దీనిపై పొంతలేని సమాధానం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో సమస్య వల్లనే అలా చూపిస్తున్నాయని, దానిని సరి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక సమస్య ఉంటే అన్‌సెటిల్డ్ పేరుపై ఉన్న భూములు లేపాక్షి హబ్‌కే ఎలా మారుతాయంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రైతులు రెవెన్యూ ముఖ్య అధికారిని అడిగితే ఇంతకాలంగా వివాదాస్పద భూముల సమస్యను మీరెందుకు పరిష్కరించుకోలేదంటూ ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఇలా రైతులకు ఎదురు ప్రశ్నలు వేయడం విస్మయానికి గురి చేస్తోంది. అన్‌సెటిల్డ్ భూములు ఆన్‌లైన్‌లో పేరు మార్పు సాంకేతిక లోపమో..? లేక బోగస్ కంపెనీలకు సాయమో..? తెలియని పరిస్థితి నెలకొంది.
లేపాక్షి హబ్‌పేరుపై చూపిస్తోంది
రామకష్ణ రెడ్డి, రైతు.
నాకు సర్వేనెంబర్ 407-14లో 1.18 ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారు 0.78 ఎకరాలు అన్నాదమ్ముల సమ్య కారణంగా ఇంతకాలంగా కోర్టు సమస్యతో అన్‌సెటిల్డ్ జాబితాలో ఉండేది. ఇప్పుడు చూస్తే 1-బిలో లేపాక్షి హబ్ అని వస్తుంది. మా భూమి మాకు తెలియకుండా లేపాక్షి హబ్ పేరుకు ఎలా మారిందో అర్థం కాని పరిస్థితి ఉంది.
రెండు రోజులక్రితం వరకు అన్‌సెటిల్డ్‌లోనే ఉంది...
సురేష్, రైతు
నా భూమికి సంబంధించి పాస్‌పుస్తకం ఇవ్వమని గత రెండేళ్లుగా నేను అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఆన్‌లైన్‌లో అన్‌సెటిల్డ్‌గా చూపుతోందని, దీంతో పాసుస్తుకం ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు చెబుతూ వచ్చారు. ఇటీవల మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంతలోనే లేపాక్షి హబ్ పేరిట భూమి వివరాలు వస్తున్నాయి. విఆర్వోను అడిగితే ఆ భూములు లేపాక్షి హబ్ పరిధిలోకి వస్తాయంటున్నారు. వారం రోజుల క్రితం వరకు కూడా మా భూమి ఆన్‌లైన్‌లో అన్‌సెటిల్డ్ కిందనే ఉంది.
ఊరిలో సగభాగం లేపాక్షి హబ్ పేరిట మార్చేశారు...
గోపాల్ రెడ్డి, తుమ్మలకుంట గ్రామం.
నేను నా పట్టా భూమిలో నిర్మించుకున్న ఇళ్లుతో పాటు మా ఊరిలో సగం ఇళ్లు లేపాక్షి హబ్ పేరిట మార్చేశారు. మా సర్వే నెంబర్ 407-1, 407-2, 409-1,409-2 మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. ప్రస్తుతం దీని వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో లేపాక్షి హబ్ పేరిట మార్చేశారు. ఇదేమని రెవెన్యూ అధికారులను అడిగితే వారు పొంతలేని సమాధానం ఇస్తున్నారు.
ఇది మరో పెద్ద కుట్ర
ఫిరంగి ప్రవీణ్ కుమార్, వ్యకాసం జిల్లా అధ్యక్షుడు.
చిలమత్తూరు మండలంలో వివిధ సమస్యలతో అపరిష్కతంగా ఉన్న రైతులను భూములను లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములుగా మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉంది. హబ్ పేరుతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన బోగస్ కంపెనీ ఇప్పుడు మరోమారు తన పేరిట సుమారు 1075 ఎకరాలను మార్చేసుకుంది. ఇందులో అధికారులు, పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు ఏమీ చేయలేరనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. ఇందులో వైసిపి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రీ సర్వేలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఆ సంస్థతో అధికారులు కుమ్మకై రైతుల భూములను కాజేయాలని కుట్ర చేస్తున్నారు. దీనిని వ్యవసాయ కార్మిక సంఘంగా తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆన్‌లైన్‌లో లేపాక్షి హబ్ పేరును తొలగించి రైతుల పేరిట భూములు మార్చకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతాం.










