Oct 29,2023 22:48

ప్రజాశక్తి-రామచంద్రపురం
రెండేళ్లుగా వివాదాస్పదంగా మారిన ద్రాక్షారామ పివిఆర్‌ హైస్కూల్‌ యాజమాన్య విధానాలపై ఆదివారం ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌ పక్కన నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వైసిపి న్యాయ విభాగం నాయకులు మాగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసన దీక్షలకు పలువురు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ రెండేళ్లుగా మూసివేసిన పివిఆర్‌ హైస్కూల్‌ యాజమాన్యం పైండా సత్య ప్రసాద్‌, అతని కుమారుడు ఇక్కడ సుమారు రూ.70 కోట్ల విలువైన ఆస్తులను నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విద్యార్థుల్లో చదువు కోసం దాతలు దానంగా ఇచ్చిన ఈ భూమిని ఆస్తులను తమ స్వప్రయోజనాలకు కల్యాణ మండపాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించుకోవాలని దురుద్దేశంతో హైస్కూల్‌ మూస ివేశారన్నారు. తిరిగి తెరుస్తామని ప్రకటించినా దాన్ని అమలు చేయలేదని పైగా లేనిపోని కేసులు పెట్టి 13 మందిని వేధిస్తున్నారన్నారు. వీటన్నింటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమానికి మద్దతునిచ్చిన వైసిపి నాయకులు పిల్లి సూర్య ప్రకాష్‌ మాట్లాడుతూ పివిఆర్‌ హైస్కూల్‌ యాజమాన్యం దాత ఇచ్చిన భూములను హైస్కూల్ను సదుద్దేశంతో ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. టిడిపి ఇన్చార్జ్‌ రెడ్డి సుబ్రమణ్యంనిరసనకారులకు మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర్‌ నారాయణ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, మాజీ జెడ్‌పిటిసి సభ్యులు ఇంతసంతోషం, మాజీ జెడ్‌పి వైస్‌ ఛైర్మన్‌ చింతపల్లి వీరభద్రరావు, చోడిశెట్టి శివాజీ, నామ వెంకన్న బాబు, కొప్పిశెట్టి శ్రీనివాసు, ఆళ్ల బుజ్జి, రావూరి సుబ్బారావు ద్రాక్షారామ, అన్నాయి పేట, వేలం పాలెం, తోటపేట, వేగాయమ్మ పేట, హాసన్‌ బాధ, ఉండూరు, రామచంద్రపురం, తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఆటో యూనియన్‌ నాయకులు నిరసన దీక్షకు మద్దతు తెలిపారు.