Mar 12,2023 18:20

dmho geethabhayi

పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు
14న జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం విజయంతానికి చర్యలు
కృష్ణాజిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ జి.గీతాభాయి
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా నిరంతరం పలు వైద్య, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటుచేస్తోందని కృష్ణాజిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ జి.గీతాభాయి చెప్పారు. ఈనెల 14న జాతీయ నులి పురుగుల నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే...
ప్రశ్న : జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం ప్రాధాన్యత ఏమిటి?
జవాబు : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈ నెల 14న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని పురస్కరించుకుని జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, అన్ని సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులు ప్రతి ఒక్కరికి అల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరిగా ఇప్పించాలని నిర్ణయించాం.
ప్ర : జిల్లా స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టారు?
జ : ఈనెల తొమ్మిదో తేదీన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌భాష అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ పి.రంజిత్‌భాష ముఖ్యఅతిథిగా హాజరై తీసుకోవాల్సిన చర్యలు గురించి సవిరంగా వివరించారు. కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని వైద్య, విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
ప్ర: ఏ వయస్సు వారికి మందులు పంపిణీచేస్తారు?
జ : ఈనెల 14న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. అదేరోజు జిల్లా వ్యాప్తంగా ఒక ఏడాది వయస్సు నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నులి పురుగుల నివారణకై ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరిగా అందజేస్తారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో అన్ని పీహెచ్సీలకు మాత్రలు పంపిణీ చేశాం.
ప్ర : ఎంతమందికి మందులు పంపిణీచేయాలని నిర్ణయించారు?
జ : జిల్లా విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు మాత్రలు పంపిణీ జరగటానికి ఏర్పాట్లు జరిగాయి. జిల్లాలో 1-19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని 4,31.823 మందిని గుర్తించాం. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ వర్కర్లు, పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తచేశాం. ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా టార్గెట్‌ గ్రూప్‌ అందరిని నూరుశాతం కవర్‌ చేయాలని ఆదేశించాం.
ప్ర: ఆల్బెండజోల్‌ మాత్రలతో నులిపురుగుల నిర్మూలన జరుగుతుందా?
జ : కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనత కలుగుతుంది. దీని నివారణకు ఈ కార్యక్రమం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా ఇవ్వబడే ఆల్బెండజోల్‌ మాత్ర ద్వారా నులి పురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించొచ్చు. ఈ మాత్ర భోజనం చేశాక చప్పరించి నమిలి మింగాలి. ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఈ విషయాలన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి.
ఈ సమావేశంలో డిఎంఅండ్‌ హెచ్‌ ఓ డా. జీ.గీతాబాయి, డి ఈఓ తహెరా సుల్తానా, ఐసిడిఎస్‌ పీడీ ఎస్‌.సువర్ణ, డిఎల్డీఎ పీడీ పిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి దూర్జటి తదితరులు పాల్గొన్నారు.
ప్ర: ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
జ : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దాం అనేది రాష్ట్రప్రభుత్వ నినాదం. పిల్లలు, కిశోర బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారు.
ప్ర : మందులు సురక్షితమైనవేనా?
జ : 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలు, కిశోర బాలలకు అల్బెండజోల్‌ 400 మి.గ్రా. మాత్ర అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా ఇవ్వబడతాయి. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజుల్లో డీవార్మింగ్‌ చేయబడని పిల్లలు కిశోర బాలలకు మాస్‌-అప్‌ రోజుల్లో మాత్రను వేయాలి. నమోదు అవ్వని, పాఠశాలకు వెళ్ళని పిల్లలు, కిశోర బాలలకు అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు ఇవ్వబడతాయి. అల్బెండజోల్‌ పిల్లలకు, పెద్దలకు సురక్షితమైన మాత్ర. ఈ మాత్రలు పిల్లలకు అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో అందజేస్తారు.
ప్ర: మందులు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ : మాత్ర గొంతులో ఇరుక్కోకుండా ఉండేందుకు దానిని బాగా చప్పరించి, శుభ్రమైన త్రాగునీటితో కలిపి మింగాలి. నులిపురుగుల సంక్రమణ ఏక్కువగా ఉన్న పిల్లలు, కిశోర బాలలకు మాత్ర వేసుకున్న తరువాత వికారం, కొద్దిగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం లాంటివి కలిగే అవకాశం ఉంది. ఇవి కొద్దిసేపే ఉండి తగ్గిపోతాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
ప్ర : ఏమైనా ఇబ్బంది తలెత్తితే ఎవరిని సంప్రదించాలి?
జ : అత్యవసర వైద్య సహాయానికి 104కు ఫోన్‌ చేయండి. మరింత సమాచారానికి ఏఎస్‌ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదిస్తే వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువస్తారు. వారు దానికి నివారోపాయాలను తెలియజేస్తారు. కోవిడ్‌ - 19 భద్రతా మార్గదర్శకాల అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణా దినోత్సవాన్ని నిర్వహించాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించాం.