May 03,2023 22:19

ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

ప్రజాశక్తి - తలుపుల : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని కదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 1.88 కోట్ల రూపాయలతో అద్భుతమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుకున్నామన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాను జన్మించానని, ప్రస్తుతం ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు నంబులపూలకుంట మండల కేంద్రంలో ఆధునికమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుకుంటున్నామని మరో నెల రోజుల లోపు దానిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల పరిశీలన : మండలంలోని గంజివారిపల్లి నుండి వేపమానిపేటకు నిర్మిస్తున్న రోడ్డు పనులను కదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పి వి సిద్ధారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేపమానిపేట పంచాయతీ పరిధిలో గల గంజివారిపల్లి, బోయపల్లి, కొత్తపూలవాండ్లపల్లి గ్రామాల ప్రజల సౌకర్యార్థ ఉపాధి హామీ పథకం కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టామన్నారు.