Jun 01,2023 20:40

మృతి చెందిన చక్రవర్తి (18)

పిడుగు పడి విద్యార్థి మృతి
- గడివేముల మండలంలో ఇద్దరికి అస్వస్థత
- కొత్తపల్లి మండలంలో గాలివాన బీభత్సం
- నేలకొరిగిన భారీ వృక్షం, విద్యుత్‌ స్తంభాలు
ప్రజాశక్తి - కోవెలకుంట్ల

     పిడుగు పడి విద్యార్థి, పాడిగేదె మృతి చెందిన సంఘటన ఉయ్యాలవాడ మండలం తుడుమెలదిన్నె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తుడుమెలదిన్నె గ్రామానికి చెందిన ఓబయ్య, ఓబులమ్మ దంపతుల కుమారుడు చక్రవర్తి(18) ఇంటర్‌ పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో బర్రెలను మేపడానికి చక్రవర్తి పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం తర్వాత ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో సమీపంలోనే పిడుగు పడింది. దీంతో ఒక పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. చక్రవర్తి సృహ తప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే చక్రవర్తిని కోవెలకుంట్ల ఉదయానంద వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. చక్రవర్తి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.
పిడుగు శబ్దానికి ఇద్దరికి అస్వస్థత
గడివేముల : పిడుగుపాటు శబ్దానికి ఇద్దరు అస్వస్థతకు గురైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. గడివేములలో కొర్రపోలుర్‌కు వెళ్లే రహదారి పక్కన పొలంలో గడివేములకి చెందిన దూదేకుల మాసుం వలి, దూదేకుల మాబాష పని చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో పిడుగు పడింది. పిడుగు శబ్దానికి వారు సొమ్మసిల్లి పడిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పొలం వద్దకు వెళ్లి వారిని 108 అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
గాలివాన బీభత్సం
కొత్తపల్లి : కొత్తపల్లి మండలం సింగరాజు పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్ర ఒక్కసారిగా గాలి వాన రావడంతో గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం పక్కన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు నేలకొరిగింది. దీంతో అక్కడే ఉన్న విద్యుత్‌ స్తంభాలు నేలవాలడంతో తీగలు తెగిపోయాయి. విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వేప చెట్లు కూడా విరిగి నివాసాలపై పడ్డాయి.