ప్రజాశక్తి మడకశిర రూరల్ : మండలంలోని మట్టి మాఫియా పెట్రేగుతోంది. ఇష్టానుసారంగా అక్రమంగా చెరువు మట్టిని జెసిపి తో తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న చెరువు మట్టి తవ్వకాలపై సంబందిత అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. మండల పరిధిలోని ఎల్లోటి గ్రామ చెరువులో కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా జెసిబి ద్వారా తవ్వించి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా తాము అనుమతులు తీసుకున్నామని చెప్పుకుంటూ పగలే మట్టి తవ్వకాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతున్నా అధికారులు మాత్రం ఆవైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికే 50 లోడ్లు మట్టిని తవ్వి ఓ ప్రైవేట్ కళాశాలకు తరలించామన పెనుగొండ నుండి తమకు పర్మిషన్లు ఉన్నాయని జెసిపి డ్రైవర్ స్వయంగా చెప్పడం గమనార్హం. మట్టి తవ్వకాలకు లోగోట్టుగా అధికారులు అనుమతులు ఇచ్చారని అందుకు తగిన ముడుపులు తీసుకున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రోజు పదుల సంఖ్యలో రహదారిపై మట్టి ట్రాక్టర్లు తిరుగుతుండడంతో రహదారులు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువు మట్టి అక్రమ తవ్వకాలకు అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాలని స్థానకులు కోరుతున్నారు. మట్టి అక్రమ రవాణాపై ఎంపిడిఒ సోనియాబారును వివరణ కోరగా తాము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, నాడు నేడు పనులకు రోజుకు 2ట్రాక్టర్ల మట్టిని మాత్రమే రవాణా చేయడానికి అవకాశం ఉందన్నారు. మరుసటి రోజు కూడా కావాలంటే తిరిగి పర్మిషన్ తీసుకోవాల్సుంటుందనానరు. ట్రాక్టర్ నెంబరు వేసి పర్మిషన్ ఇస్తామన్నారు. ఇప్పటికైతే మట్టికి ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.










