ఆందోళనలో ముంపు మండలాల ప్రజలు
కాజ్‌వేలపైకి చేరిన నీరు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ప్రజాశక్తి - కుక్కునూరు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులలో సామర్థ్యానికి మించి ఉన్న నీటిని దిగువకు వడలడంతో గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతుండటం, దీనికితోడు కాపర్‌డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల శుక్రవారం కుకునూరు - దాచారం మధ్య గల గుండేటి వాగుపై ఉన్న కాజ్‌వేపైకి వరద నీరు చేరింది. దీంతో వాగుకు ఓవైపున ఉన్న దాచారం, బెస్తగూడెం, నెమలిపేట, సీతారామపురం, అరవపల్లి, గుండంబోరు, ఉప్పరిమద్దిగాట్ల, తదితర 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో వచ్చిన గోదావరి వరదలకు నెలరోజులపాటు కాజ్‌వే ముంపులోనే ఉండటంతో 12 గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్రఇబ్బందులు పడుతూ చుట్టూ 15 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద పూర్తిగా తగ్గడంతో గత 20 రోజులుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. మళ్లీ వరద కాజ్‌వేను ముంచడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమవ్వడంతో గోదావరి వరదలు రావనే నమ్మకంతో మండలంలోని రైతులు పత్తి, మిర్చి పంటల సాగు పనిలో నిమగమయ్యారు. మూడు నెలలుగా గోదావరి పెరుగుతూ, తగ్గుతూ ఉండటంతో దాచారం- కుక్కునూరు మధ్య కాజ్‌వేపై నుండి పది రోజులు కూడా రాకపోకలు సాగలేదు. వరద పెరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
వేలేరుపాడు : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో పాటు పోలవరం వద్ద నిర్మించిన కాపర్‌డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో శుక్రవారం ఎద్దువాగు, ఎర్రతోగు మధ్య గల ఎద్దువాగు కాజ్‌వేను వరద ముంచెత్తడంతో వాగు ఓవైపున ఉన్న కట్కూరు, టేకూరు, కోయిదా, కాసారం, తదితర 17 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పెరిగితే పత్తి, మిర్చి పంటలు ముంపునకు గురవుతాయనే ఆందోళన రైతుల్లో నెలకొంది.










