Apr 18,2023 22:13

శిథిలావస్థకు చేరిన పురాతన కట్టడాన్ని చూపుతున్న మైనాస్వామి, తదితరులు

ప్రజాశక్తి -పెనుకొండ : పెనుకొండను భారతవారసత్వ నగరంగా ప్రకటించాలని చరిత్రకారుడు మైనాస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పలువురు పురప్రముఖులతో కలిసి ఆయన పట్టణంలోని పెనుకొండ కోట, చారిత్రక కట్టడాలను సందర్శించారు. ఈ సందర్బంగా మైనాస్వామి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పెనుకొండను సుందర వారసత్వ నగరంగా అభివృద్ధి చేయడానికి కనీసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధిలో వెనుకబడివుండడం శోచనీయమని అన్నారు. ప్రాచీనమైన, పటిష్టమైన, అత్యంత పొడవైన కోటలు ఆంధ్రప్రదేశ్‌లో మూడు మాత్రమే ఉన్నాయన్నారు. మొదటిది కొండవీడు(గుంటూరు జిల్లా) కాగా, రెండవది పెనుకొండ, మూడవది చంద్రగిరి(తిరుపతి జిల్లా). అని చెప్పారు. అయితే పెనుకొండ మినహా మిగిలిన చోట్ల ఎక్కువ కట్టడాలు లేవన్నారు. ఏడు ప్రాకారాల కోటలు, అద్భుత శిల్పకళా నిలయాలైన హిందూ, జైన ఆలయాలు, సుందర పుష్కరిణులు, మెట్ల బావులు, రాజ భవనాలు ఇక్కడ ఉన్నాయన్నారు. పార్శ్వనాథ, అజితనాథ జైన తీర్థంకరుల గుడులు, రామభద్ర, కాశీ విశ్వేశ్వర సన్నిధులు అరుదైన శిల్పశోభతో అలరారుతున్నాయని చెప్పారు. వందల సంఖ్యలో శాసనాలున్నాయని వాటిలో పదులసంఖ్యలో పాడయ్యాయని అన్నారు. పెనుకొండను వారసత్వ నగరంగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఒక యథాస్థితి నివేదికను రూపొందించడం ద్వారా అభివృద్ధి పనులు అమలు చేయాలని కోరారు. గగనమహల్‌ వద్ద నుంచి పెద్దకొండకు తీగ మార్గం(రోప్‌ వే), పెనుకొండ చరిత్రను వివరించే లేజర్‌ షో, థీం పార్క్‌, అంతర్జాతీయస్థాయి పురావస్తు ప్రదర్శనశాల, కళ-సాంస్కృతిక వేదిక, అందమైన ఉద్యాన వనాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భారత పర్యాటక పటంలో పెనుకొండను సమున్నత స్థాయిలో నిలపాలని కేంద్ర పర్యాటక శాఖకు విన్నవిస్తున్నామన్నారు. పుర ప్రముఖులు,చరిత్రకారులు ఢిల్లీ వెళ్ళి మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విహెచ్‌పి అధ్యక్షులు వేదవ్యాస్‌, రామకృష్ణ, సుధాకర్‌ గుప్తా, నాగరాజు, త్రినాధ్‌, యతి తదితరులు పాల్గొన్నారు.