పుట్టపర్తి రూరల్ : ఉద్యోగులకు హక్కు అయిన పింఛన్‌ను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఇది దుర్మార్గమైన చర్యని సిఐటియు శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఈఎస్.వెంకటేష్ తెలిపారు. ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యమ పిలుపు మేరకు శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీ జెఎసి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మైనుద్డీన్, జిల్లా కార్యదర్శి జివైపి రావు అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీరికి ధర్నాకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈసందర్భంగా ఇఎస్.వెంకటేశలు మాట్లాడుతూ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాలు వెంటనే వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు పెన్షన్లు తీసుకుంటూ, ఉద్యోగులకు తొలగించడం దుర్మార్గం అన్నారు. మైనుద్దీన్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో సింగిల్‌విండో విధానంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు చేకూర్చాలని చేపట్టిన పథకం మంచిదేనని, కాకపోతే ఆ సచివాలయాల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాగాలేదన్నారు. సంబంధం లేని పనులన్నిటినీ వారిపై రుద్ది వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. స్టేషనరీ సైతం ఉద్యోగులే కొంటున్నారన్నారన్నారు. మూడు డీఏలు, 2018, 2019 అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపు 20ఏళ్ల నుంచా చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలపై శనివారం కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టగా నిర్వీర్యం చేయడానికి వార్డు సచివాలయ ఉద్యోగులను ఇందులో పాల్గొనకుండా అదనపు పనులను వారికి అప్పజెప్పడం దుర్మార్గం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు స్వస్తి పలికి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి కార్యదర్శి పద్మనాభం, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సివిపి ఆర్‌ఎస్ రెడ్డి, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం చౌడప్ప, ఆర్టీసీ ఉద్యోగులు రామంజి, సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చంద్ర, జిల్లాలోని అన్ని విభాగాల ఉద్యోగ సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.










