ప్రజాశక్తి-ఆదోని
మండలంలోని పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్‌లు పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ రహదారికి సంబంధించిన భూ సేకరణ పెండింగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. 'గడపగడపకు మన ప్రభుత్వం'లో భాగంగా నాగలాపురం, చిన్నహరివాణం, కపటి, గనేకల్లు, కుప్పగల్లు, పెద్దహరివాణం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు వచ్చిన గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రెయినేజీ పనులకు ఈనెల చివరిలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మండగిరి గ్రామల్లో జల జీవన్ మిషన్ త్రాగునీరు అందించే కార్యక్రమం టెండర్ దశను పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తహశీల్దార్ వెంకటలక్ష్మి, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజినీర్ ఖాదర్ బాష, ఆర్‌డబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీధర్ రావు, డిప్యూటీ ఇంజినీర్ శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తలుపులు మూసి సమావేశం : సమావేశానికి మీడియాకు అనుమతి లేకుండా రహస్యంగా నిర్వహించారు. ప్రజా సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పనుల గురించి చర్చించే సమయంలో అంత రహస్యం ఏముందో అధికారులు తేల్చాలని పలువురు పేర్కొన్నారు. అభివృద్ధి గురించి నిర్వహించాల్సిన సమావేశంపై అంత గోప్యత ఏమిటో అధికారులే తెలపాల్సి ఉంది.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్










