ప్రజాశక్తి -పెనుకొండ :పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిపిఎం, సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణం లోని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు హరి, మండల కార్యదర్శి రమేష్, సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి అందించే విద్యుత్ ఒప్పందం, విదేశాలకు బొగ్గు సరఫరా, ఓడరేవులు అదానీ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. తాజాగా స్మార్ట్ మీటర్లు తయారు చేసే కంపెనీని కూడా అదానీ ప్రారంభించారన్నారు. ఇలా విద్యుత్ రంగం మొత్తం అదాని గుప్పెట్లోకి వెళ్లిందన్నా రు. ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారన్నారు. పనిలో పనిగా పాలకులు జేబులు నింపుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో ప్రతి ఇంటికీ, షాపునకు స్మార్ట్ మీటర్లు పెట్టబో తున్నారని, తద్వారా ప్రతి కనెక్షన్‌పై సుమారు రూ. 13 వేలు ఉంటుందన్నారు. ఆ సొమ్మును నెలకు రూ. 120 నుంచి రూ. 150 వరకు పదేళ్ల పాటు వసూలు చేయడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. స్మార్ట్ మీటర్లు వస్తే భవిష్యత్తులో గంట గంటకూ ఓ ధర నిర్ణయించే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో సిపిఎం, సిపిఐ, సిఐటియు నాయకులు గంగాధర్, నరసింహా, మహేష్ బాబు, ముత్యాలు, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం మండల సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల బాధ్యులు బాలస్వామి మాట్లాడుతూ వేళపాలా లేని విద్యుత్ కోతలు ఆపాలని, ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, 200 యూనిట్ల లోపు వారందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని నమ్మబలికిన జగన్ సర్కార్ నాలుగేళ్లలో 7 సార్లు పెంచి రూ. 20వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు చాంద్‌బాషా, అల్లాబకాష్, రఫిక్, అంకన్న, అంజనమ్మ, ఆంజనేయులు, అమర, గంగరాజు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కాశీం, తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : కరెంటు బిల్లులు తగ్గించాలని రైతుల మోటర్లకు మీటర్లు అమర్చి రాదని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు శివకుమార్, రైతు సంఘం బండల వెంకటేష్, లక్ష్మీనారాయణ, ఓబులేష్, నాగప్ప, ఓబులమ్మ, మంగమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తనకల్లు : మండల పరిధిలోని కోటూరు సబ్ స్టేషన్ ఎదురుగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన నాలుగున్నర ఏళ్ల కాలంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాడని విమర్శించారు. రైతుల మోటార్లకు బలవంతంగా స్మార్ట్ మీటర్లు అంటగడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివన్న, వివి రమణ, ఎస్వీ రమణ, సిపిఐ నాయకులు రెడ్డప్ప, చౌడప్ప, చలపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ఎదురుగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, తిప్పయ్య, గుంజేపల్లి కష్ణయ్య, మార్కండేయులు, ఆదెప్ప తదితరులు పాల్గొన్నారు
కదిరి టౌన్ : సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు తగదని సిపిఎంమ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బి రెడ్డి, సీపీఎం టౌన్ సెక్రెటరీ జిఎల్ నరసింహులు, సిపిఐ డివిజన్ కార్యదర్శి కదిరప్ప అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీల ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం కదిరి ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిఇ మోజేష్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జగన్మోహన్, రామ్మోహన్, ముస్తక్, బాబ్జాన్, ఫాజిల్, శంకర్ రెడ్డి, మహిళా సంఘం నాయకురాలు హేమావతి ,సిపిఐ నాయకులు లియాకత్, రాజేష్, ఇమ్రాన్, ఉపేంద్ర పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వేలకోట్లు రూపాయల భారం మోపుతూ విద్యుత్ రంగాన్ని ఆదాని తదితర బడా కంపెనీలకు కట్టబెడుతున్నారని సిపిఎం, సిపిఐ నాయకులు విమర్శించారు. విద్యుత్‌ఛార్జీల పెంపును నిరసిస్తూ సిపిఎం, సిపిఐ నాయకులు పట్టణంలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగం మొత్తాన్ని ఆదానీ చేతిలో పెట్టారని విమర్శించారు. మోడీ, జగన్ కలిసి సామాన్య ప్రజల నడివిరిస్తున్నారని అన్నారు. 200 యూనిట్లు వాడే వారందరికి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి జగన్మోహన్‌రెడ్డి ప్రజలను తీవ్రమోసం చేస్తున్నారన్నారు. అనంతరం ఎఇకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలారామాంజినేయులు, సిపిఎం నాయకులు ఎస్‌హెచ్ బాషా, పట్టణ కార్యదర్శి నామాలనాగార్జున, సిఐటియు ఆదినారాయణ, ఆయూబ్ ఖాన్, అన్నంసూరి, బాలాజీ, నాగేంద్ర, షేక్షవలి, సిపిఐ రవికుమార్, రమణ, వెంకటస్వామి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










