ప్రజాశక్తి- రొళ్ల : ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వ్యవసాయ పనులకు వెళితే ఏరోజుకారోజు కూలి చెల్లిస్తారు. దాంతో కూలీల రోజువారి జీవనం సాగుతుంది. పేద కూలీలకు ఏ రోజుకుఆరోజు వేతనాలు చెల్లింపు చేస్తే అదే రోజు సాయంత్రం ఇంటికి కావలసిన సరుకులను తీసుకుంటారు. ఎప్పటినుంచో రోజువారి కూలీల బతుకులు ఇలాగే సాగుతున్నాయి. గ్రామాల్లో పనులు లేని సమయంలో వారు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కూలీలకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధి పథకం కింద ఏడాదికి వందరోజులు పనులు కల్పిస్తోంది. సిపిఎం, వ్యకాసం పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని తెచ్చింది. అయితే ఈ పథకాన్ని కేంద్రం రాను రాను నీరుగార్చే యత్నం చేస్తోంది. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రొళ్ల మండల వ్యాప్తంగా కూలీలకు సంబంధించి రూ. 10 లక్షలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. పనులు చేసి నాలుగు వారాలు దాటిన వారికి వేతనాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. పనులు చేసే ప్రాంతంలోనూ ఇప్పటికీ ఉన్న సౌకర్యాలు కూడా నామ మాత్రాన అందిస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, టెంట్లు లాంటివి గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి ఎక్కడ కనిపించడం లేదు. కూలీలు తమ ఇళ్ల నుంచి బాటిళ్లలో తాగునీరు తీసుకుని వెళుతున్నారు. అవి ఎండకు వేడెక్కుతున్నాయి. వాటినే కూలీలు తాగుతున్నారు. మండుటెండల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్న సరైన టెంట్లు లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. చెట్లు ఉంటే సరి లేకుంటే ఎండలోనే ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి రావలసిన వేతనాలు చెల్లించి కూలీలకు సరిపడే సౌకర్యాలను కల్పించి కూలీలను ప్రోత్సహించాలని కూలీలు కోరుతున్నారు.










