Jul 15,2023 08:52

క్వారీలో ప్రొక్లైనర్లతో జరుగుతున్న పనులు

       చిలమత్తూరు : ఆ పంచాయతీలోని గ్రామాలు సైబీరియన్‌ వలస పక్షులకి వసతి కేంద్రం. ప్రతి ఏడాది వేలాది సైబీరియన్‌ పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. వాటి సంరక్షణను సైతం ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షిస్తోంటోంది. అయితే ఇటీవల పర్యావరణ, అటవీశాఖల శాఖల అధికారుల నిర్లక్ష్యం ఆ ఎర్రకాళ్ల కొంగలకు శాపంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో క్వారీని నిర్వహిస్తుండడంతో వాటి నుంచి వెలువడే మందుగుండు శబ్ధాలకు పక్షులు ఆ ప్రాంతానికి రావడమే మానేశాయి. చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీలోని హుస్సేనాపురం పరిసర గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓ కంకర క్వారీ అటు ప్రజలకు ఇటు విదేశీ విహంగాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతి సైబీరియన్‌ పక్షుల విడిది కేంద్రంగా ఉంది. 2007వ సంవత్సరంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సెజ్‌ పేరుతో మండల వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వాలు 8844 ఎకరాలను సేకరించే ప్రయత్నం చేశాయి. కాగా పర్యాటక కేంద్రంగా ఉన్న వీరాపురం పంచాయతీ కాలుష్యమయం అవుతుందనే ఉద్ధేశంతో ఆ ప్రాంతంలో భూములు సేకరించలేదు. ఇంతటి సున్నితమైన చోట క్వారీ ఏర్పాటుకు ఇటు అటవీ, మైనింగ్‌ శాఖలు ప్రయివేటు వ్యక్తులకు అనుమతులు ఇచ్చారు. గత రెండేళ్ల క్రితం ఇదే సమస్యపై ప్రజాశక్తిలో ''క్వారీ కాదు గోరీ'' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి స్పందిస్తూ అదికారులు అప్పట్లో క్వారీని రద్దు చేశారు. అయితే ప్రస్తుతం మళ్లీ ఆ క్వారీ పనులు ప్రారంభం అయ్యాయి. అధికారులు వీటికి అనుమతులు ఇచ్చారా? లేక రాజకీయ పలుకుబడితో దీనిని నిర్వహిస్తారో తెలియదని కానీ నిబంధనలకు విరుద్ధంగా గుట్టుగా గుట్టను మొత్తం దోచేస్తున్నారు. శ్రీ మారుతీ స్టోన్‌ క్రషర్‌ పేరుతో నడుపుతున్న ఈ క్వారీకి ఇరు వైపుల ఆనుకుని రెండు చెరువులు ఉన్నాయి గతంలో వీటిలోకి ఆహారానికి వచ్చే వీరాపురం పక్షులు క్వారీలో జరుగుతున్న పేళుళ్ల శబ్ధానికి అటుగా రావడం మానేసినట్లు హుస్సేన్‌పురం గ్రామస్తులు చెబుతున్నారు. గుట్ట నుంచి బండరాళ్లను బద్దలు కొట్టడానికి పేలుడు పదార్థాలు వాడటం కారణంగా ఈ శబ్ధానికి అటవీ ప్రాణులుకు సైతం ప్రాణపాయంగా మారింది. దీని కారణంగా సైబీరియన్‌ పక్షుల మనుగడ ప్రశ్నర్థకంగా మారింది.
రద్దు చేసిన దానికి అనుమతులు ఎలా ఇచ్చారు.?
గత రెండేళ్ల క్రితం మైనింగ్‌ అదికారులు ఇటు అటవీశాఖ అదికారులు ఈ క్వారీని సీజ్‌ చేసినట్లు అప్పట్లో వెల్లడించారు. క్వారీ సీజ్‌లో ఉన్నా గత 6 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా లక్షలాది రూపాయలు విలువజేసే కంకరను కర్నాటక ప్రాంతానికి ఇక్కడ నుంచి చేరవేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పరిశీలన చేస్తే యథేచ్ఛగా క్వారీ కంకర్‌ మిషన్‌ నడుస్తున్న దృశ్యాలు కన్పిస్తాయి. కంకర ధరల పట్టికను కూడా అక్కడ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబందిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమీప గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. క్వారీ నిర్వహణకు మళ్లీ అనుమతులు ఇచ్చారా.? అన్నదానిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఒకసారి సున్నితమైన ప్రదేశం అని నిర్ధారించి అనుమతులు రద్దు చేసిన క్వారీకి మళ్లీ అనుమతలు ఎలా ఇచ్చారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ విషయంపై వివరణ కోరేందుకు అటవీ శాఖ అధికారిని ప్రజాశక్తి ఫోన్‌ ద్వారా స్పందించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
కృత్రిమ చర్యలే ప్రకృతి వైపరిత్యాలకు కారణమా..!
ఈ మధ్య కాలంలో విపరీతమైన గాలుల కారణంగా వీరాపురం గ్రామంలో అతిథి పక్షులు, వాటి పిల్లలు పదుల సంఖ్యలో మత్యువాత పడ్డాయి. ఇది ప్రకతి వైపరిత్యం అనడం కన్న వాతావరణం కాలుష్యం వల్ల పర్యవరణంలో వచ్చిన మార్పు అని పర్యావరణ ప్రేమికులు అప్పట్లో విమర్శించారు. వాతావరణ సమతుల్యతకు తోడ్పాటు నిచ్చే కొండలు గుట్టలను అక్కడ ఉన్న చెట్లు నేలమట్టం చేయడంతో పాటు పేలుడు పదార్థాలు వాడి గాలీ కాలుష్యం చేయడం కూడా కారణాలుగా ఉన్నాయి.