సెల్ఫీ చాలెంజ్ చేస్తున్న సామకోటి ఆదినారాయణ
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : అన్న క్యాంటీన్లు రద్దుచేసి పేదవాడి నోటి వద్ద ముద్ద లాక్కున్నట్లుగా వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందని టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి నారాయణ విమర్శించారు. శుక్రవారం పుట్టపర్తి మున్సిపాలిటీలోని ఎనుముల పల్లి బస్టాండ్ సమీపంలో టిడిపి హయాంలో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను సెల్ఫీ ద్వారా వైసిపి ప్రభుత్వానికి చూపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి 5 రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టాలని చంద్రబాబు రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంతోమందికి ఉపయోగపడే క్యాంటీన్లను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మంచి పథకాలు కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉందన్నారు.










