Aug 15,2023 21:38

జాతీయ పతకాన్ని వందనం చేస్తున్న మంత్రి వనిత

ప్రజాశక్తి - పార్వతీపురం : అభివృద్ధి, సంక్షేమ రంగాలను రెండు కళుగాగా భావిస్తూ పేదరిక నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర హోంశాఖా మంత్రి తానేటి వనిత అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి వనిత జాతీయ జెండాను ఎగురవేశారు. పెరేడ్‌ కమాండర్‌ ఎస్‌పి విక్రాంత్‌పాటిల్‌ నేతృత్వంలో నిర్వహించిన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వ అండుగులు వేస్తుందన్నారు. అందులో భాగంగా ఇటీవల నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రంలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శిబిరాలు నిర్వహించి 1,23,329 సేవలు, ధ్రువీకరణ పత్రాలు పంపిణీచేశామన్నారు. ''జగనన్నకు చెబుదాం'' కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను 1902 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా నేరుగా తెలియజేసే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. చదువులకు ఏ ఒక్కరూ దూరం కాకూడదని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిస్తుందన్నారు. ఈఏడాది టెన్త్‌ పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని, అదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంఓఇంచారు. నాడు - నేడు కార్యక్రమం రెండవ దశ కింద 535 పనులు రూ.144 కోట్లతో మంజూరు చేశామన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఫ్యామిలి డాక్టర్‌ విధానంలో జిల్లాలో 700 గ్రామాలో వైద్య బృందాలు పర్యటించి 2.35 లక్షల మందికి వైద్య సేవలు అందించాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,620 శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. పార్వతీపురం, సీతంపేటలో రూ.98.52 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతున్నా యని ,భద్రగిరి, సాలూరు, కురుపాం, సీతంపేటలో రూ.48 కోట్లతో ఆసుపత్రుల అప్‌ గ్రేడేషన్‌, ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో రూ.21.15 కోట్లతో 150 పడకల పెంపు పనులు,వి. ఆధునికీకరణ పనులు రూ.1.81 కోట్లతో జరుగుతున్నాయని తెలిపారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.18 కోట్లతో పనులు మంజూరు చేయడం జరిగింది. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లను రూ.35 కోట్లతో నిర్మంచడం జరుగుచున్నది. టిహెచ్‌ఆర్‌లో భాగంగా జిల్లాలో 23,812 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 126 క్వింటాళ్ళ చిరుధాన్యాలను పంపిణీ చేసేందుకుు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వ్యవసాయం రంగంలో ఆధునీకరణలో భాగంగా జిల్లాలో 127 కస్టమ్‌ హైర్‌ కేంద్రాలను, 4 సమీకత వ్యవసాయ లాబ్‌ లను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా 2022 -23 లో 1,39,505మంది రైతులకు రూ.188 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంద న్నారు. జిల్లాలో 1076 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులను విడుదల చేశామన్నారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పాడిపరిశ్రమ, మత్స్యపరిశ్రమ దిశగా అడుగులు వేయాలని, ఆదాయ ఆర్జన మార్గాల దిశగా ఆలోచించాలని కోరారు.
జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, జలవనరులు పుష్కలంగా ఉన్నాయని, వీటిని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకుని ప్రతి ఎకరాకు నీరు అందించి సశ్యశ్యామలం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 4 మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులను రూ.154 కోట్లతో చేపట్టామన్నారు. ప్రతి ఒక్క ఇంటికి తాగు నీటి సరఫరా చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా జల జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద 2024 నాటికి నీటి సరఫరా చేయడంలో భాగంగా 2859 పనులు చేపట్టి ఇప్పటి వరకు 1,36,246 ఇళ్లకు కొళాయిలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో 27,142 మందికి ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 11,705 గహాల నిర్మాణం పూర్తి అయ్యాయి. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మూడవ స్ధానంలో నిలిచిందన్నారు. జిల్లాలో 30 వేల మంది గిరిజనులకు 81 వేల ఎకరాల్లో ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ కింద పట్టాలు జారీ చేశామన్నారు. జిల్లాలో 311 గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు, 302 రైతు భరోసా కేంద్రాలు, 192 వై.యస్‌.ఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలను రూ.231 కోట్లతో మంజూరు చేశామన్నారు. జిల్లాలో 182 మొబైల్‌ టవర్లు నిర్మాణానికి స్థలాలను మంజూరు చేయగా, వీటిలో 19 టవర్లు పూర్తి చేసి సిగల్స్‌ ను అందించామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన విన్నపాల మేరకు 2,363 పనులను రూ.59 కోట్లతో మంజూరు చేశామన్నారు. జిల్లా గుండా విశాఖపట్నం - రాయిపూర్‌ జాతీయ రహదారి పనులు పూర్తి కావస్తుండటం శుభసూచకమన్నారు. రైల్వే లైను మూడో పనులు సైతం శరవేగంగా సాగడమే కాకుండా పార్వతీపురం రైల్వే స్టేషన్‌ అభివద్ధి చెందడం సంతోషదాయకం. గతంలో రహదారి లేని అనేక గ్రామాలకు రహదారుల సౌకర్యం వచ్చిందన్నారు. అటవీ ప్రాంతంలో 52 రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు ఏడాది కాలంలో మంజూరు చేశామన్నారు. ఉపాధి హామీ వేతనదారులకు 87 లక్షల పని దినాలు కల్పించామన్నారు.
జిల్లాలో పారిశ్రామికీకరణ ఆవశ్యకత ఉందన్నారు. పాచిపెంట మండలంలో ఇండిస్టియల్‌ పార్క్‌, సీతంపేట మండలం పనుకువలస వద్ద 30 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఇ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 130 గ్రామాల్లో 77,770 ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేశామన్నారు. జిల్లాకు పర్యాటకంగా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. సీతంపేట మండలం అడాలి వ్యూపాయింట్‌ అభివృద్ధితోపాటు, సీతంపేటలో గిరిజన మ్యూజియం ఏర్పాటు, గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్‌.కె.పాడులో పర్యాటక అభివద్ధికి అడుగులు వేస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో జిల్లాలో 4 నైపుణ్య అభివద్ధి సంస్ధలను ఏర్పాటు చేయడమే కాకుండా జాబ్‌ మేళాలను నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 13 జాబ్‌ మేళాలు నిర్వహించి 2,164 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలకు పదును పెట్టి జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రాణించేలా ప్రోత్సహించుటకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అక్టోబరు 2వ తేదీన ప్రారంభించి 46 రోజుల పాటు సచివాలయం, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి నుండి రాష్ట్ర స్ధాయి వరకు నిర్వహిస్తుందన్నారు.
జిల్లాకు అవార్డులు రివార్డులు
నూతనంగా ఏర్పడిన జిల్లా అయినప్పటికి వైద్య ఆరోగ్య శాఖకు ''ఆయుష్మాన్‌ ఉత్కష్ట్‌ పురష్కార్‌'', సాలూరు మున్సిపాల్టీకి ''స్వచ్ఛ సర్వేక్షణ్‌'' అవార్డు, జోగుంపేట పంచాయతీకి ''జాతీయ పంచాయతీ'' అవార్డు, ఆశావాహ జిల్లాకు నీతి ఆయోగ్‌ ప్రశంసలతో పాటు అదనంగా మూడు కోట్ల రూపాయల ప్రోత్సాహం, రాష్ట్ర స్ధాయిలో 8 ఉత్తమ పాఠశాలల్లో ''మన జిల్లాకు చెందిన 4 పాఠశాలలు'' ఎంపిక మనందరికి గర్వకారణమని ఇందుకు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వచ్చంద సేవా సంస్ధలకు, ఉద్యోగులకు, యువతకు, మహిళలకు, అభినందనలు తెలిపారు.
ఆకట్టుకున్నట్టు ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జట్టు ఆశ్రమం, సొంబర మాస్టారు బృందం, కె.జి.బి.వి. జోగంపేట విద్యార్థినులు, కెజిబివి గరుగుబిల్లి పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, విద్యాశాఖ, ఐటిడిఎ, గృహ నిర్మాణ శాఖ, విపత్తుల నిర్వహణ శాఖల శకటాలను ప్రదర్శించారు. అందులో విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి, జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ శకటానికి రెండో బహుమతి, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి మూడో బహుమతి, ఐసిడిఎస్‌ శకటానికి నాలుగో బహుమతి గెలుచుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మత్స్య శాఖ, ఐటిడిఎ పార్వతీపురం, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, విద్యార్థుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఆప్కో, వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ను జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌, ఎస్‌.పి. విక్రాంత్‌ పాటిల్‌ సందర్శించారు. స్టాల్స్‌ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యేలు ఎ.జోగారావు, వి. కళావతి, పి.పుష్ప శ్రీవాణి, టిడ్కో చైర్మన్‌. జె.ప్రసన్నకుమార్‌, దాసరి కార్పొరేషను చైర్‌పర్శన్‌ ఆర్‌.రమాదేవి, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు, ఎస్‌.పి. విక్రాంత్‌ పాటిల్‌, పిఒ సి విష్ణు చరణ్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ఎఎస్‌పి ఒ.దిలీప్‌ కుమార్‌, ఆర్‌డిఒ కె.హేమలత, దిశ డిఎస్‌పి హర్షిత చంద్ర, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.