Sep 06,2023 23:00

అప్పుల వల

        అనంతపురం ప్రతినిధి : పేదల అమాయకత్వం, బలహీనతలను ఆసరాగా చేసుకుని వలపన్నీ మాయమాటలతో రుణ భారాన్ని నెత్తిన మోపుతున్న ఘటనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కదిరి ప్రాంతంలో ఒక కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సంస్థ, ట్రాక్టర్‌ షోరూమ్‌ యజమానాలు, మధ్య దళారీలు కలసి అమాయక నిరుపేదలపై రుణభారాన్ని మోపుతున్నారు. ఈ రుణం చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు అసలు విషయం తెలసి మోసపోయిన అమాయకులు లబోదిబోమంటున్నారు. ఈ రకంగా కదిరి పట్టణంలోని ఒక్క షోరూమ్‌ పరిధిలోనే సుమారు 30 ట్రాక్టర్లను ఇచ్చి మాయం చేసి సుమారు రెండు కోట్లకుపైగా అప్పును పేదలపై మోపారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు ఎక్కడున్నాయో కూడా రుణం తీసుకున్న వారికి తెలియకపోవడం గమనార్హం.
అంతా పక్కా పథకం ప్రకారమే
ఎక్కడైనా రుణమివ్వాలంటే సవాలక్ష విచారించి, అన్నీ సక్రమంగా ఉంటేనే ఇస్తారు. రుణం తీసుకునే వ్యక్తి ఏ రకంగా చెల్లించగలుగుతాడు, ఆయన ఆర్థిక స్థితిగతులేమిటి అన్న వివరాలు తెలుసుకుని రుణం ఇవ్వటం పరిపాటి. ఇక్కడ మాత్రం ఏమీ లేకుండానే పేదల అమాయకత్వాన్ని గుర్తించి కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది, షోరూమ్‌ యజమాని, గ్రామీణ స్థాయిలో ఇటువంటి వారిని గుర్తించే మధ్య దళారీ కలగలసి ఈ వ్యవహారాన్ని పక్కా పథకం ప్రకారం నడిపారన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా నిరుపేదలుగా ఉండి ఏమీలేని వారికి కొంత మొత్తం ముట్టజెప్పి షోరూమ్‌ వరకు మధ్య దళారీ తీసుకొస్తాడు. షోరూమ్‌ యాజమాని, ఫైనాన్స్‌ సంస్థ సిబ్బంది నీకేమి కాదంటూ సంతకాలు తీసుకుని ఆయన పేరు మీద ట్రాక్టర్‌కు పూర్తి ఫైనాన్స్‌ను చేస్తారు. సంతకాలన్నీ తీసుకున్నాక అతడిని ఇంటికి పంపుతారు. వాస్తవానికి రుణం పొందిన వ్యక్తికి ట్రాక్టర్‌ కూడా అందజేయరు. దీన్ని మరో వ్యక్తికి అక్కడే లక్ష నుంచి రెండు లక్షలు తీసుకుని అమ్మేస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా షోరూమ్‌ యజమాని వద్ద ఉండవు. కొంత సమయం తరువాత ఫైనాన్స్‌ సంస్థకు సంబంధించిన రికవరీ బృందాలు రుణం చెల్లించాలని వెళ్లిన సమయంలో బాధితులకు అసలు విషయం తెలుస్తోంది. పూటగడవటమే కష్టంగానున్న తాము ఇంత పెద్ద అప్పును ఏ రకంగా చెల్లించగలమని లబోదిబోమనే పరిస్థితి నెలకొంటోంది.
ఎవరూలేని దొడ్డప్పకు ఎనిమిది లక్షల రుణం
ఓబుళదేవరచెరువు మండలం వీర ఒబన్నగారిపల్లి గ్రామంలో దొడ్డప్ప అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఎవరూలేరు. వ్యవసాయ భూమి కూడా 80 సెంట్లకు మించి లేదు. వ్యవసాయ కూలీ పనులకెళ్తేగానీ పూటగడవదు. మద్యం సేవించే అలవాటూ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ వ్యక్తిని ప్రలోభపెట్టి కదిరి పట్టణంలోని జాన్‌డీర్‌ షోరూమ్‌కు తీసుకెళ్లారు. ఆయనతో సంతకాలు తీసుకోవడం అన్నీ పూర్తి చేసి రుణం మంజూరు చేశారు. సదరు వ్యక్తి ట్రాక్టర్‌ను ఇంటికి కూడా తీసుకురాలేదు. ఆయన పేరు మీద పూర్తి ఎనిమిది లక్షలు ఫైనాన్స్‌ చేశారు. వాహనం మాత్రం ఆయనకు అప్పగించలేదు. దీన్ని కదిరి ప్రాంతంలోనే మరో వ్యక్తికి అమ్మేశారు. ఇప్పుడు ఎనిమిది లక్షలకు సంబంధించి కట్టాల్సిన వాయిదాల కోసం రికవరీ బృందం ఇంటికెళితే తనకు అంత రుణమిచ్చినట్టు తెలియదని దొడ్డప్ప చెబుతున్నాడు. ఈ విషయం ప్రజాశక్తి దొడ్డప్పను అడుగగా 'మా ఊరి రెడ్డి పిలుచుకుపోతే పోయాను. ట్రాక్టర్‌ చూశాను. అయినా నాకు ట్రాక్టర్‌ వద్దని ఆ రోజే చెప్పి.. ఇంటికొచ్చాను.' అని దొడ్డప్ప తెలిపాడు. ఇలా ఈ ప్రాంతంలోనే సుమారు 30 మంది వరకు ఇదే రకమైన బాధితులున్నట్టు సమాచారం. వారందరూ ఇప్పుడు తమకు తెలియకుండానే అప్పులు ఎలా వచ్చిందంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయిస్తామని బాధితులు చెబుతున్నారు.